నహాన్: హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించగా, 51 మంది గాయపడ్డారు. వంతెనపై నుంచి వెళ్తున్న బస్సు అదుపు తప్పి నదిలో పడి పోయింది. ఈ ప్రమాదం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిర్మూర్ జిల్లాలో చోటు చేసుకుంది. 

షిమ్లాకు 160 కిలోమీటర్ల దూరంలోని రేణుక - దడహూ నహాన్ రోడ్డుపై ఖాద్రీ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు జరిగింది. బస్సు రేణుక జీ నుంచి నహాన్ వెళ్తుండగా అదుపు తప్పి జలాల్ వంతెన రెయిలింగ్ ను ఢీకొట్టి 40 అడుగుల లోతు గల జలాల్ నదిలో పడిపోయింది. 

గాయపడిన 51 మందిని నహాన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరిని గుర్తించారు. మృతులు సత్య రామ్ (59), ఆయన భార్య భగ్వంతీ దేవి (52) ఉన్నారు. 

బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మితిమీరిన వేగంతో వంతెనను దాటించడానికి డ్రైవర్ ప్రయత్నించినట్లు చెబుతున్నారు. 

సంఘటనపై సిర్మూర్ డిప్యూటీ కమిషనర్ లలిత్ జైన్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. 20 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆయన నహాన్ సబ్ డివిజనల్ మేనేజర్ ను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.20 వేల చొప్పున, గాయపడినవారికి రూ. 5 వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.