ఈర్ష్య, ద్వేషాలు మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తాయి. ఈ క్రమంలో తన కన్నా బాగా చదువుతోందన్న కక్షతో నలుగురు యువకులు బాలికపై అత్యాచారం చేశారు. వివరాల్లోకి వెళితే.. సీతాపూర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో బాలిక 8వ తరగతి చదవుతోంది.

ఆమె కుటుంబానికి సమీప బంధువులు కూడా అదే పాఠశాలలో చదువుకుంటున్నారు. ఆ బాలిక తరగతిలో ప్రథమురాలిగా నిలవగా.. పై తరగతులకు చెందిన ఆ బాలురు మాత్రం పరీక్షల్లో తప్పారు.

దీంతో వారిని తల్లిదండ్రులు తీవ్రంగా మందలించారు. దీనిని వారంతా అవమానంగా భావించారు. ఆమెపై ఈర్ష్యతో రగిలిపోయిన నలుగురు బాలురు పథకం పన్నారు. ఈ క్రమంలో ఓ రోజు పాఠశాలలో భోజన విరామ సమయంలో ఆమెను భోజనానికి పిలిచారు.

సిబ్బంది గదిలో ఆమెకు మత్తుమందు కలిపిన ఆహారాన్ని ఇచ్చారు. బాలిక స్పృహ కోల్పోగానే నీచానికి ఒడిగట్టారు. ఆమెకు మెలకువ వచ్చిన తర్వాత ఇక్కడున్నానేమిటి అని అడగటంతో ఆటస్థలంలో స్పృహ తప్పి పడిపోతే సిబ్బంది గదిలోకి తీసుకొచ్చామని తెలిపారు.

అయితే ఆ తర్వాత రోజే అకృత్యానికి పాల్పడిన దృశ్యాలు శనివారం ఓ వాట్సాప్ గ్రూపులో కనిపించడంతో బాలిక, ఆమె తల్లిదండ్రులు దిగ్రాంతికి లోనయ్యారు.

వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేయగా.. మిగతా నలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ టీచర్ సైతం పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది.