మీ డేటా మొత్తం లీక్! ఐసీఎంఆర్ వద్ద నున్న 81.5 కోట్ల మంది పౌరుల సమాచారం అమ్మకానికి

భారత దేశంలో ఇప్పటి వరకు జరగని విధంగా పెద్ద స్థాయిలో డేటా చౌర్యం జరిగినట్టు సమాచారం. ఐసీఎంఆర్ వద్దనుండే 81 కోట్ల మంది భారత పౌరుల వ్యక్తిగత సమాచారం లీక్ అయింది. కరోనా టెస్టులు చేసుకున్న పౌరుల వివరాలు ఇందులో ఉన్నాయి. ఈ సమాచారాన్ని డార్క్ వెబ్‌లో హ్యాకర్లు అమ్మకానికి పెట్టారు.
 

81.5 crore indian citizens data with ICMR hacked? kms

న్యూఢిల్లీ: మన దేశంలో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో అతిపెద్ద డేటా లీక్ అయినట్టు సమాచారం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వద్ద గల 81.5 కోట్ల మంది భారత పౌరుల వ్యక్తిగత సమాచారం లీక్ అయింది. కరోనా టెస్టుల సమాచారం నుంచి ఈ డేటా కలెక్ట్ చేసినట్టు త్రెట్ యాక్టర్ అనే ఓ ఎక్స్ హ్యాండిల్ పేర్కొంది.

ఇది చాలా సున్నితమైన విషయం కావడంతో ఐసీఎంఆర్ ఫిర్యాదు చేయగానే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయి.

ప్రభుత్వ సైట్ హ్యాక్ చేసి లీక్ చేసిన ఈ సమాచారాన్ని డార్క్ వెబ్‌లోని బ్రీచ్డ్ ఫోరమ్‌లో అమ్మకానికి పెట్టాడు. ఇందులో 81.5 కోట్ల భారత పౌరుల సమాచారం ఉన్నది. ఆధార్, పాన్ కార్డు, పేర్లు, ఫోన్ నెంబర్లు, చిరునామా సహా పలు వ్యక్తిగత వివరాలు అందులో ఉన్నాయి. 

ఈ సమాచారం లీక్ అయినట్టు సీఈఆర్‌టీ-ఇన్ ఐసీఎంఆర్‌కు తెలియజేసినట్టు సమాచారం. లీక్ అయిన శాంపిల్స్‌ సమాచారాన్ని ఐసీఎంఆర్ వద్దనున్న సమాచారంతో పోల్చితే మ్యాచ్ అయిందని, దీంతో అన్ని దర్యాప్తు ఏజెన్సీలు రంగంలోకి దిగినట్టు తెలిసింది.

ఈ వ్యవహారంలో విదేశీ శక్తుల ప్రమేయం ఉండటంతో దేశ ఉన్నత దర్యాప్తు ఏజెన్సీ రంగంలోకి దిగనుంది. ప్రస్తుతానికైతే నష్ట నివారణ కోసం అవసరమైన పద్ధతులను అనుసరిస్తున్నారు.

కరోనా టెస్టుల డేటా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ), ఐసీఎంఆర్, కేంద్ర ఆరోగ్య శాఖలకు వెళ్తుంది. అయితే, ఈ డేటా ఎక్కడి నుంచి లీక్ అయిందనే స్పష్టత ఇంక రాలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

అమెరికన్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రీసెక్యూరిటీ తొలుత ఈ డేటా లీక్‌ను గుర్తించింది. ఈ త్రెట్ యాక్టర్ అలియాస్ పీడబ్ల్యూఎన్0001 అక్టోబర్ 9వ తేదీన బ్రీచ్ ఫోరమ్స్‌లో ఓ త్రెడ్ పోస్టు చేశాడని తెలిపింది. 81.5 కోట్ల మంది భారత పౌరుల ఆధార్, పాస్‌పోర్టు వంటి రికార్డులను అందుబాటులో ఉంచినట్టు వివరించింది. ఆధార్ డేటాను ప్రూఫ్‌గా పేర్కొంటూ నాలుగు పెద్ద శాంపిల్స్‌లో ఈ డేటాను స్పెడ్ షీట్స్‌లలో పీడబ్ల్యూఎన్0001 షేర్ చేశాడని పేర్కొంది. హంటర్ అనలిస్ట్ ఈ డేటా జెన్యూన్ అని, ఆధార్ కార్డు డేటాను ప్రభుత్వ వెబ్ సైట్‌లోని వెరిఫై ఆధార్ ఫీచర్ ద్వారా సరిపోల్చి చూశాడని తెలిపింది. 

Also Read: హమాస్ కిడ్నాప్ చేసి గాజాలో ఊరేగించిన జర్మనీ యువతికి చిత్ర హింసలు, ఆమె మృతదేహం లభ్యం

భారత ఆరోగ్య వ్యవస్థను హ్యాకర్లు లక్ష్యం చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. గతేడాది ఎయిమ్స్ ఈ ముప్పును పలుమార్లు ఎదుర్కొంది. ఫిబ్రవరి నుంచి ఐసీఎంఆర్ సర్వర్లను హ్యాక్ చేయడానికి సుమారు 6,000 సార్లు ప్రయత్నాలు జరిగాయి. ఈ విషయం ఐసీఎంఆర్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థల అవగాహనలో ఉన్నది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios