హరియాణా సర్కారు జారీచేసిన గైడ్‌లైన్స్ ప్రకారం నవంబరు 2 నుంచి 9 వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ పాఠశాలలు తెరిచారు.

కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడిన సంగతి తెలిసిందే. కాగా.. పలు చోట్ల ఇప్పుడిప్పుడే పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. అయితే.. తెరిచిన పాఠశాలల్లో విద్యార్థులు కరోనా బారిన పడుతుండటం బాధాకరం. హరియాణాలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రెవాడీలోని ఐదు ప్రభుత్వ పాఠశాలలు, మూడు ప్రైవేట్ పాఠశాలకు చెందిన 80 విద్యార్థులకు కరోనా సోకింది.

 దీంతో జిల్లా విద్యాశాఖలో కలకలం చెలరేగింది. ఆయా స్కూళ్లను 15 రోజుల పాటు మూసివేయడంతో పాటు, శానిటైజ్ చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. హరియాణా సర్కారు జారీచేసిన గైడ్‌లైన్స్ ప్రకారం నవంబరు 2 నుంచి 9 వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ పాఠశాలలు తెరిచారు.

దీపావళి అనంతరం వైద్యఆరోగ్యశాఖ జిల్లాలోని కొన్ని ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 837 మంది విద్యార్థులకు కరోనా టెస్టులు నిర్వహించింది. వారిలో 80 మందికి కరోనా సోకినట్లు తేలింది. కాగా రెవాడీ జిల్లా కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలో ఇప్పటి వరకూ 1,04,821 టెస్టులు చేయగా, 9,224 మందికి కరోనా సోకినట్లు తేలిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 491 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు.