బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చాలా మంది అభ్యర్థులు తక్కువ మెజారిటీతో విజయం సాధించినట్లు వార్తలు వస్తున్నాయి. లెక్కింపులో కొన్ని తప్పిదాలు జరిగాయని, అందుకే ఇలాంటి ఫలితాలు వచ్చాయని కొన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి.

ప్రస్తుతం బిహార్‌లో ఈ అంశం చర్చనీయాంశమైంది. ఇందుకు కారణం లేకపోలేదు. పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన ఫలితాల్లో ముందు మహాకూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి.

అయితే వీటన్నింటీని తలకిందులు చేస్తూ ఎన్డీయే కూటమి రెండో సారి విజయం సాధించింది. ఎన్డీయే అభ్యర్థుల విజయంపై మొదటి నుంచి పలు విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు చాలా చోట్ల జేడీయూ, బీజేపీ అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో గెలవడం మరిన్ని అనుమానాలను కలిగిస్తోంది.

బార్బిగాలో జేడీయూ అభ్యర్థి 113 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. హిస్లాలో అత్యంత స్వల్పంగా 12 ఓట్లతో ఆర్జేడీ అభ్యర్థిపై జేడీయూ అభ్యర్థి విజయం సాధించారు. బక్రి, రామ్‌గర్, చకారి, మతిహాని, కుర్హాని, బార్బిగా నియోజకవర్గాల్లో 1,000 కంటే తక్కువ మెజారిటీతో వివిధ పార్టీల అభ్యర్థులు గెలిచారు.

కౌంటింగ్‌లో చిన్నా చితకా మినహా ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వలేదని, కౌంటింగ్ చాలా ప్రశాంతంగా, పారదర్శకంగా సాగిందని ఈసీ మంగళవారం సాయంత్రం ప్రకటించింది. ఈవీఎంలపై లెక్కింపులు అనుమానాలపై తాము చాలా సార్లు వివరణలు ఇచ్చామని ఈ విషయాన్ని పదే పదే అడగాల్సిన అవసరం లేదని ఈసీ నొక్కి చెప్పింది.

Also Read:బీహార్ సీఎం నితీష్ కుమారే: తేల్చి చెప్పిన బీజేపీ

హిల్సా నియోజకవర్గ ఫలితం రాజకీయ దుమారానికి వేదికైంది. ఇక్కడ జేడీయూ అభ్యర్థి కృష్ణ మురారీ శరణ్‌ 12 ఓట్ల మెజారిటీతో ఆర్జేడీ అభ్యర్థి ఆర్తీ మునిపై విజయం సాధించారు.

మురారీకి 61,848 ఓట్లు రాగా, మునికి 61,836 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఇదే విషయాన్ని పేర్కొన్నారు. అయితే, ఆర్జేడీ మాత్రం ఇవన్నీ తప్పుడు లెక్కలని ఆరోపణలకు దిగింది.

తొలుత తమ అభ్యర్థి ముని 547 ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారని రిటర్నింగ్‌ అధికారి చెప్పి.. మళ్లీ మాట మార్చారని ఆర్జేడీ నేతలు వాదిస్తున్నారు. విన్నింగ్‌ సర్టిఫికెట్‌ కూడా ఇస్తామని చెప్పి.. అంతలోనే డ్రామాకు తెరతీశారని విమర్శించారు.