ఢిల్లీలోని హరి నగర్ ప్రాంతంలో 75 ఏళ్ల మహిళను హత్య చేసి దోచుకున్నారనే ఆరోపణలతో ఆ ఇంట్లో డొమెస్టిక్ హెల్ప్ గా పనిచేస్తున్న వ్యక్తితో సహా మరోఇద్దరిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. 

75 యేళ్ల సావిత్రి శర్మ, ఆమె భర్త ఇద్దరూ ఒంటరిగా హరినగర్ లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. సావిత్రిశర్మ క్యాన్సర్ తో బాధపడుతుండగా, భర్త మానసిక స్థితి సరిగా లేదు. ఈ క్రమంలో తమకు సాయంగా ఓ కేర్ టేకర్ ను నియమించుకున్నారు.

ఈ క్రమంలో సావిత్రిశర్మ అపస్మారకస్థితిలో ఆర్కిడ్ ఆసుపత్రిలో చేర్పించినట్లు జూన్ 1 న పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులకు ఆమె మాట్లాడే స్థితిలో లేదు కాబట్టి స్టేట్మెంట్ ఇవ్వలేదని డాక్టర్లు తెలిపారు. 

సావిత్రి శర్మ మెడమీద గొంతు పిసికినట్టుగా గుర్తులు ఉండడంతో అనుమానించిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణను ప్రారంభించారు. ఆ తరువాత ఆమె గాయాలతో మరణించింది.

సావిత్రి శర్మ దీర్ఘకాలిక క్యాన్సర్ రోగి కాగా, ఆమె భర్త జైపాల్ మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో... ’ఇటీవల  మోను అనే వ్యక్తిని కేర్ టేకర్ గా నియమించుకున్నారు. అయితే పోలీసుల విచారణలో అతను ప్రతీసారి తన స్టేట్మెంట్లను మార్చుతూ ఉండటంతో అతనిమీద అనుమానం పెరిగింది. సాంకేతిక నిఘా సహాయంతో, సంఘటన జరిగిన రోజున, మోనుతో పాటు మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారని, వారు కొంత సమయం తరువాత అక్కడ నుండి హడావుడిగా వెళ్లిపోయారని" తెలిపిందని పోలీసులు చెప్పారు.

"మోను తన సహచరులు విశాల్, నవీన్లతో కలిసి మహిళను, ఆమె భర్తనుదోచుకోవటానికి కుట్ర పన్నాడు. ముసలివాళ్లు అందులోనూ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వారు  'ఈజీ టార్గెట్' గా అనుకున్నారు. ఈ కేసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశాం... అని పోలీసులు తెలిపారు.