న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఒక్క రోజులోనే 53, 475 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 5 మాసాల్లో ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.

తాజాగా నమోదైన 53 వేల కరోనా కేసులతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,17,87,594కి చేరుకొన్నాయి.  గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే తాజాగా నమోదైన కేసులు 13 శాతం ఎక్కువ అని వైద్య ఆరోగ్య శాఖాధికారుల గణాంకాలు చెబుతున్నాయి. నిన్న దేశంలో 47, 262 కరోనా కేసులు నమోదయ్యాయి.

గత రెండు వారాలుగా దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలోని 18 రాష్ట్రాల్లో డబుల్ మ్యూటాంట్ వేరియంట్ కనుగొన్నట్టుగా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

దేశంలోని మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, కర్ణాటక, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.మహారాష్ట్రలో 31,855 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 25,64,881 కి చేరుకొన్నాయి.