కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జనవరి 15వ తేదీ వరకు ఎన్నికల ర్యాలీలు, సభలు నిషేదించినట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది.
5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ సుశీల్ చంద్ర శనివారం సాయంత్రం ప్రకటించారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్య పాలనలో భాగమని ఆయన అన్నారు. అందుకే ఒమిక్రాన్ వేరియంట్, థర్డ్ వేవ్ నేపథ్యంలో కూడా ఈ ఎన్నికలు సమర్థనీయమే అని ఎన్నికల సంఘం తెలిపింది.
మొదటి సారిగా ర్యాలీలు రద్దు..
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మొదటి సారిగా ఎన్నికల కమిషన్ ఓ నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల ర్యాలీలు, రోడ్ షోలను జనవరి 15 వరకు రద్దు చేస్తున్నామని ప్రకటించింది. కోవిడ్ పరిస్థితిని సమీక్షించిన తరువాత ఈ నిషేధాన్ని సమీక్షిస్తామని పేర్కొంది. అయితే కొన్ని పరిమితులతో, తక్కువ సంఖ్యలో బహిరంగ సమావేశాలు మాత్రం అనుమతించబడతాయని తెలిపింది.
కోవిడ్ భద్రతా చర్యలపై దృష్టి
ఈ ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో అత్యధిక మంది ఓటింగ్ లో పాల్గొనేలా కోవిడ్ భద్రతా చర్యలపై దృష్టి సారించనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు. “అభ్యర్థులు తమ ప్రచారాన్ని వీలైనంత వరకు వర్చువల్ మోడ్‌లో నిర్వహించాలి. బహిరంగ రహదారులపై సమావేశాలు ఉండవు. కౌంటింగ్ తర్వాత కూడా విజయోత్సవ ఊరేగింపు ఉండదు” అని ఆయన తెలిపారు. ఓటర్లు, అభ్యర్థులు, పార్టీలు, కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని చెప్పారు. రాజకీయ సమావేశాలకు పార్టీలు మాస్క్‌లు, శానిటైజర్‌లను ఇవ్వాలని అన్నారు. ఇంటింటికీ ప్రచారంలో పాల్గొనే ప్రతీ బృందంలో ఐదుగురు మాత్రమే ఉండాలని చెప్పారు. ఓ అభ్యర్థి అయినా. లేదా ఏ పార్టీ అయినా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఓటింగ్ సమయం గంట పొడగింపు..
ప్రతీ పోలింగ్ బూత్‌లో శానిటైజర్లు, మాస్కులు, కోవిడ్ నుంచి రక్షించే అన్ని రకాల పరికరాలు ఉంటాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. అలాగే పోలింగ్ బూత్ ల సంఖ్య కూడా పెంచుతున్నట్టు తెలిపారు. ఓటింగ్ సమయాన్ని ఊడా గంట పెంచనున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, నిపుణులు, సంబంధిత రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులతో సవివరంగా చర్చించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తున్నామని ఆయన చెప్పారు. క్షేత్ర స్థాయి పరిస్థితులు అన్ని పరిశీలించిన తరువాత భారత ఎన్నికల సంఘం భద్రతా నిబంధనలతో ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు.
గతేడాది కరోనా కేసులు ఉన్నప్పటీకీ ఏప్రిల్-మేలో నిర్వహించిన ఎన్నికలు విమర్శలకు గురయ్యాయి. అందుకే ఎన్నికల కమిషన్ కఠిన నిర్ణయాలు అమలు చేస్తోంది. కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది. అయితే ఐదు రాష్ట్రాల్లో జరిగే ఈ ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరగనున్నాయి. మొదటి విడత పోలింగ్ ఫిబ్రవరి 10వ తేదీన జరగనుండగా.. మార్చి 7వ తేదీన ఏడో విడత ఎన్నికలు జరుగుతాయి. మార్చి 10వ తేదీన ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు
