న్యూఢిల్లీ:ఇండియాలో మరో ఐదు కొత్త స్ట్రెయిన్ కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం స్ట్రెయిన్ కరోనా కేసులు 25కి చేరాయి.

యూకేలోని బ్రిటన్ లో ఈ వైరస్ తొలుత గుర్తించారు.  విదేశాల నుండి ఇండియాకు వచ్చినవారి నుండి ఈ వైరస్ వచ్చినట్టుగా వైద్యులు గుర్తించారు.

మంగళవారం నాడు దేశంలో ఆరుగురికి కరోనా స్ట్రెయిన్ వైరస్ ఉన్నట్టుగా గుర్తించారు. కర్ణాటక నుండి ముగ్గురు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల నుండి ఒక్కొక్కరికి ఈ స్ట్రెయిన్ వైరస్ సోకింది.

బుధవారంనాడు 14 కొత్త కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలోని బెంగుళూరులో నలుగురికి స్ట్రెయిన్ సోకిందని నిపుణులు తేల్చారు. 8 కేసులు ఢిల్లీలో నమోదయ్యాయి. బెంగాల్ రాష్ట్రంలోని కళ్యాణిలో  మరో కేసు నమోదైంది.

తాజాగా గురువారం నాడు ఐదు కేసులు నమోదయ్యాయి.  దేశంలో రోజు రోజుకి స్ట్రెయిన్ కేసులు నమోదు కావడంతో వైద్య శాఖాధికారులు అప్రమత్తమయ్యారు.

కొత్త వైరస్ చాలా వేగంగా విస్తరించే లక్షణం కలిగి ఉందని నిపుణులు తేల్చి చెప్పారు. మాస్క్, భౌతిక దూరం పాటించడం ద్వారా ఈ వైరస్ వ్యాప్తిని వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని వైద్య ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు.

ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకుగాను అంతర్జాతీయ విమానాలను వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు నిషేధం విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.