రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కన్నుమూసిన సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. యెలహంకలోని కొగిలు క్రాస్‌ వద్ద కారు, అంబులెన్స్‌ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.

మృతులను పశ్చిమబెంగాల్‌కు చెందిన దీపక్‌ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. చెన్నైలో ఉంటున్న వీరు తమ బంధువులను కలిసేందుకు బెంగళూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొగిలు క్రాసింగ్‌ వద్ద దీపక్‌ కుటుంబం ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న అంబులెన్స్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో దీపక్‌, సంజయ్‌, ఇదే కుటుంబానికి చెందిన మరో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. 

తీవ్రంగా గాయపడిన మరో బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.