పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్టైక్స్ నేపథ్యంలో భారత్, పాక్‌ల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 45 మంది పాకిస్తానీయులకు భారతదేశ పౌరసత్వాన్ని కల్పించారు అధికారులు.

వివరాల్లోకి వెళితే.. దశాబ్ధాల క్రితం పాక్ నుంచి మహారాష్ట్రలోని పుణేకి వచ్చి స్థిరపడిన కొందరు తమకు భారత పౌరసత్వం కావాలని దరఖాస్తు పెట్టుకున్నారు. ఇది ఎన్నో ఏళ్లపాటు పెండింగ్‌లో ఉండిపోయింది.

ఈ క్రమంలో వీరిలో 45 మందికి భారత పౌరసత్వం ఇస్తున్నట్లు పుణే జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. పాక్‌లో తాము ఎన్నో అవస్థలు పడి భారత్‌కు వలసవచ్చామని.. చివరకు తమకు భారత పౌరసత్వం లభించడం ఎంతో సంతోషంగా ఉందని జయకాష్ నభావాణి తెలిపారు.

20 ఏళ్ల కిందట ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు తాను భర్తతో కలిసి భారతదేశానికి వచ్చామని, ఇక్కడి వాతావరణం నచ్చడంతో భారత్‌లో ఉండిపోదామని చెప్పినట్లు లాజ్ విర్వానీ తెలిపారు.

పాక్‌లో ఇంటి నుంచి బయటకు అడుగుపెడితే చాలు కిడ్నాప్‌లు జరుగుతుండేవని ఆమె అనుభవాలను గుర్తుచేసుకున్నారు. పాక్ ఏ మాత్రం సురక్షితం కాదని వారు అభిప్రాయపడ్డారు.