ట్యాంకులో పడి నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం విదిశలో చోటుచేసుకుంది. బాలుడు కోసం వెతుకుతూ తండ్రి... తెరచి ఉన్న ట్యాంకు మూత వేశాడు. అయితే... తన కొడుకు ఆ ట్యాంకులో పడిపోయిన విషయాన్ని ఆయన ఆలస్యంగా గుర్తించాడు. కానీ అప్పటికే చిన్నారి ఊపిరాడక కన్నుమూశాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే... విదిశలోని అరిహంత్ విహార్ ప్రాంతానికి చెందిన మహేంద్ర పాలిటెక్నిక్ కాలేజీ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా.. అతనికి అనంత్ అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా.. ఆదివారం ఉదయం బాలుడికి స్నానం చేయించేందుకు తండ్రి ఇంటి బయటవున్న ట్యాంకులో నుంచి ఒక బకెట్ నీటిని తీసుకువచ్చి బాత్రూమ్‌లో పెట్టారు. తరువాత ఆ ట్యాంకుకు మూతవేశారు. 


అయితే అనంత్ కనిపించకపోవడంతో ఇంట్లోని వారంతా వెదకసాగారు. ఇంతలో ఎవరో ఒకసారి ట్యాంకులో చూడలేకపోయారా? అని సలహా ఇచ్చారు. దీంతో తండ్రి వెంటనే ట్యాంకు మూత తెరచి చూశారు. అక్కడ అనంత్ అచేతన స్థితిలో కనిపించాడు. కుమారుడిని బయటకు తీసుకువచ్చి, ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అనంత్ మృతి చెందాడని వైద్యులు స్పష్టం చేశారు. నీటి కోసం ఏర్పాటు చేసిన ట్యాంకరే.. తమ చిన్నారి ప్రాణలు మింగేసిందని కన్నీరు మున్నీరుగా కుటుంబసభ్యులు విలపించారు.