పవిత్ర పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మరో మహిళ ప్రవేశించింది.  అన్ని వయసు మహిళలు ఆలయంలోకి ప్రవేశించవచ్చు అంటూ... సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత.. ఇటీవల ఇద్దరు మహిళలు అయ్యప్పను దర్శించుకున్న సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద దుమారమే రేగింది. కాగా.. తాజాగా మరో మహిళ స్వామివారిని దర్శించుకుంది.

అయితే.. 36 ఏళ్ల వయసు ఉన్న ఆమెను ఎవరూ అడ్డుకోకపోవడం గమనార్హం. స్వామి ఆలయంలోకి వెళ్లకుండా ఎవరూ ఆమెను అడ్డుకోకుండా ఉండేందుకు.. జుట్టుకి తెల్లరంగు వేసుకొని వెళ్లడం విశేషం.ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.

‘‘ నేను జనవరి 8వ తేదీన శబరిమల ఆలయంలోకి ప్రవేశించి.. స్వామివారిని దర్శించుకున్నాను. త్రిస్సూర్ నుంచి బస్సులో శబరిమల వచ్చాను. దాదాపు 2గంటల పాటు.. నేను ఆలయంలోనే గడిపాను. పెద్ద వయసు ఆమెలా కనిపించేందుకు నేను నా  తలకి తెల్లరంగు వేసుకున్నాను. దీంతో నన్ను ఎవరూ అడ్డుకోలేదు. ఇదే వేషంతో నేను మరోసారి కూడా స్వామిని దర్శించుకుంటాను’’ అని ఆమె విడుదల చేసిన వీడియోలో ఉంది.

ఆమె పేరు ఇందు అని.. దళిత మహిళా ఫెడరేషన్ కార్యకర్తగా గుర్తించారు. ప్రస్తుతం ఈమె వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.