మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ ముంబయిల ట్రాఫిక్ సమస్యల గురించి మాట్లాడారు. రోడ్డు ఎక్కితే ట్రాఫిక్ జామ్ అని, రోడ్లంతా గుంతల మయం అని పేర్కొన్నారు. ఈ ట్రాఫిక్ సమస్యల కారణంగానే ముంబయిలో మూడు శాతం విడాకులు జరుగుతున్నాయని లెక్క కట్టారు. ఈ విడాకుల అంశం సోషల్ మీడియాలో దుమారం రేపింది.
ముంబయి: మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృతా ఫడ్నవీస్(Amrutha Fadnavis) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది సహా పలువురు ఆమె కామెంట్లపై ట్రోలింగ్(Trolling) చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రోడ్ల గురించి ప్రస్తావించారు. ముంబయిలోని రోడ్లు గుంతల మయంగా మారాయని ఆమె ఆరోపించారు. ట్రాఫిక్ జామ్(Traffic Jam) కూడా ఎక్కువగా ఉంటున్నదని పేర్కొన్నారు. ముంబయి(Mumbai)లో జరుగుతున్న విడాకుల(Divorce)కు కారణం ఈ ట్రాఫిక్‌నే అని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
‘మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్యను చెబుతున్నానని మరిచిపోండి.. నేను ఇప్పుడు ఒక సాధారణ మహిళగా మాట్లాడుతున్నా.. రోడ్డెక్కితే ట్రాఫిక్ గండం ఎలా ఉంటుంది. రోడ్డుపై గుంతలు ప్రయాణాన్ని ఎలా నరకప్రాయం చేస్తాయో నేను ప్రత్యక్షంగా అనుభవించి ఉన్నాను. ఈ ట్రాఫిక్ సమస్యల వల్లే చాలా మంది తమ కుటుంబంతో గడపే సమయాన్ని పొందడం లేదు. అందుకే ముంబయిలో దంపతుల మధ్య జరుగుతున్న విడాకుల్లో మూడు శాతం విడాకులకు ఈ ట్రాఫిక్ సమస్యనే కారణం’ అని ఆమె విలేకరులతో చెప్పారు.
ఆమె మాటల వీడియోను మీడియా సంస్థలు సోషల్ మీడియాలో పోస్టు చేశాయి. అంతే, సామాజిక మాధ్యమాల్లో ఒక్కసారిగా ఈ వీడియోపై దుమారం రేగింది. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ కామెంట్లపై వ్యంగ్యంగా రియాక్ట్ అయింది. ఇది బెస్ట్ లాజిక్ ఆఫ్ ది డే అంటూ చురకలు అంటించారు. రోడ్లపై ట్రాఫిక్ సమస్య కారణంగా మూడు శాతం ముంబయి వాసులు విడాకులు ఇస్తున్నారని చెప్పిన ఈ మహిళకు బెస్ట్ లాజిక్ ఆఫ్ ది డే వెళ్తుంది అంటూ వ్యంగ్యాస్త్రం విసిరారు. మెదడుకు విశ్రాంతి ఇచ్చే బదులు.. దయచేసి మీరే హాలీడే తీసుకోండి అంటూ కామెంట్ చేశారు. అంతేకాదు, బెంగళూరు వాసులు ఈ సమాచారాన్ని చదవకండి.. ఎందుకంటే.. ఈ వివరాలు మీ కుటంబాన్నే ఛిన్నాభిన్నం చేయొచ్చు అంటూ స్మైల్ ఇమోజీలు పెట్టారు.
ఇదిలా ఉండగా, గతేడాది కూడా శివసేన, బీజేీపల మధ్య వాగ్యుద్ధంలో అమృతా సింగ్ ఉన్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ కూడా.. వీలు దొరికినప్పుడల్లా శివసేనపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ ఉంటారు. బీహార్ లో సేన ఓటమిని ఎద్దేవా చేస్తూ ఫడ్నవిస్ భార్య అమృత అనూహ్య వ్యాఖ్యలు చేయడంతో వివాదం మొదలైంది. శివసేన ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో ఐ లెటర్ తీసేసి.. ఏ అనే లెటర్ చేర్చితే.. శివసేన కాస్త.. శవసేన గా మారుతుంది అంటూ.. అమృత ఎద్దేవా చేశారు. కాగా.. ఆమె చేసిన కౌంటర్ కి ఆ పార్టీ నేతలు ఎదురు దాడి చేయడం మొదలుపెట్టారు. అమృత పేరులోని మొదటి అక్షరం ఏ తీస్తే.. మృతం అవుతుందని అంటే మరాఠిలో మరణంతో సమానమని శివసేన పార్టీ నేతలు పేర్కొన్నారు. ఎవరి పేరులో అయినా.. ప్రతి అక్షరం ముఖ్యమేనని శివసేన మహిళా పార్టీ నేత నీలమ్ గోర్హే పేర్కొన్నారు.
