మూగ, చెవుడు యువతిపై ఐదుగురు వ్యక్తులు కర్కశంగా ప్రవర్తించారు. మూగపిల్ల అనే కనికరం కూడా లేకుండా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా... నిందితులు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఛత్తీస్ గడ్ లో ని బిలాస్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బిలాస్పూర్ జిల్లాలోని మారవాహి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 25వ తేదీ రాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 22ఏళ్ల బదిర యువతి మార్కెట్ కి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. ఆమెను ఐదుగురు వ్యక్తులు అడ్డుకున్నారు. బలవంతంగా యువతిని ద్విచక్రవాహనం ఎక్కించుకొని నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ ఒకరి తర్వాత మరొకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ యువతిని అక్కడే వదిలేసి వాళ్లు పరారయ్యారు.

ఆ తర్వాత యువతి ఇంటికి చేరుకొని తన తల్లి, అత్తలకు సైగల ద్వారా తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో బాధితురాలి తల్లి వెంటనే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువచ్చింది. నిందితులపై ఫిర్యాదు చేసింది. కాగా... ఓ టీచర్ ని తీసుకువచ్చి... బాధిత యువతి ఏం చెబుతుందో పోలీసులు ఆమె ద్వారా తెలుసుకున్నారు.

ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితులు డోలె కుజూర్, సంజీవ్ కుమార్ , సూరజ్ లహ్రే, కృష్ణ కుజూర్, గౌరీ శంకర్ లు గా గుర్తించారు. వారిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.