ప్రియుడి కళ్లెదుటే... ప్రియురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువకుడిపై దాడి చేసి మరీ... యువతిని రేప్ చేశారు. ఈ దారుణ సంఘటన తమిళనాడులోని విళుప్పురం జిల్లా పుల్లిచ్చేరిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  కండబంగలం ప్రాంతానికి చెందిన యువతి, సూరమంగళానికి చెందిన యువకుడు ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో ఆ ప్రాంతానికి నలుగురు యువకులు మద్యం తాగేసి వచ్చారు.

ఏకాంతంగా ఉన్న ప్రేమ జంట దగ్గరకు వెళ్లి.. యువకుడిపై దాడి చేశారు. అనంతరం యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకుని పారిపోయిన బాధితుడు సెల్‌ఫోన్‌లో స్నేహితుడికి సమాచారం అందించాడు. అతనొచ్చిన వెంటనే వారిద్దరూ కలిసి ఆ నలుగురు యువకులను ఎదిరించారు. వారు మరోమారు దాడిచేసి అక్కడ నుంచి పారిపోయారు. ఆ మార్గాన వెళ్తున్న కొందరు..యువతి గాయాలతో స్పృహతప్పి పడి ఉండటం చూసి ఆమెను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.