జైపూర్: రాజస్థాన్ లో దారుణమైన సంఘటన వెలుగు చూసింది. 19 ఏళ్ల యువతిపై ఇద్దరు యువకులు నాలుగేళ్లుగా పదే పదే అత్యాచారానికి పాల్పడుతూ వచ్చారు. ఉదయ్ పూర్ జిల్లాలోని ఝరోనికి సరాయ్ గ్రామానికి చెందిన యువతి నాలుగేళ్ల కిందట ఖైంపురలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. 

అప్పటి నుంచి ఇద్దరు పలుకుబడి గల యువకులు ఆమెను బెదిరించి పలమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. సెప్టెంబర్ 26ల తేదీన వారిలో ఒకతను బాధితురాలి ఇంట్లోకి చొరబడి ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో అక్కడి నుంచి పారిపోయాడు.

దాంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఒకతను బాధితురాలికి తెలిసిన వ్యక్తి. అతనితో పాటు అతని మిత్రుడు ఆమెపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. వీడియో తీసి ఆమెను బెదిరిస్తూ అత్యాచారానికి పాల్పడుతూ వచ్చారు. 

ఇదిలావుంటే, గురుగ్రామ్ లో పాతికేళ్ల వయస్సు గల యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం రాత్రి ఆ సంఘటన జరిగింది. ఆమెపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను తీవ్రంగా కొట్టారు. దాంతో ఆమె తల పగిలింది. వారిని పోలీసులు అరెస్టు చేశారు.

ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో జరిగిన సంఘటనపై దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన నేపథ్యంలోనే ఈ సంఘటనలు జరిగాయి.