బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుర్చీకి ఎసరు వచ్చే విధంగానే కనిపిస్తోంది. ఇద్దరు కాంగ్రెసు శాసనసభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. తాజాగా రమేష్ జర్కిహోలి తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు సమర్పించారు. ఇది వరకు ఆనంద సింగ్ రాజీనామా చేశారు.

తన రాజీనామా లేఖను స్పీకర్ కెఆర్ రమేష్ కుమార్ కు సమర్పించినట్లు ఆనంద సింగ్ చెప్పారు. రాజీనామాల గురించి తనకు తెలియదని, ఏ నాయకుడు కూడా తనను సంప్రదించలేదని స్పీకర్ అన్నారు. ఏ నాయకుడు కూడా తనను సంప్రదించడం గానీ కలవడం గానీ చేయలేదని ఆయన అన్నారు. 

రాజకీయ పరిణామాలతో తనకు ప్రమేయం లేదని అన్నారు. 20 మంది శాసనసభ్యులు రాజీనామా చేసినా తాను ఆమోదిస్తానని చెప్పారు. అయితే, రాజీనామాలు తన వద్దకు రాలేదని చెప్పారు. 

ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని తాను అనుకోవడం లేదని కాంగ్రెసు నేత, రాష్ట్ర మంత్రి డికె శివకుమార్ అన్నారు. తనకు కొన్ని వ్యక్తిగత సమస్యలున్నాయని ఆనంద సింగ్ చెప్పినట్లు ఆయన తెలిపారు. ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నించానని, అయితే సాధ్యం కాలేదని శివకుమార్ అన్నారు. 

ప్రస్తుతం ముఖ్యమంత్రి కుమారస్వామి అమెరికాలో వ్యక్తిగత పర్యటన చేస్తున్నారు. తాజా పరిణామాలపై ఆయన స్పందించారు. ఇక్కడి నుంచే తాను పరిణామాలను పరిశీలిస్తున్నానని, తన ప్రభుత్వాన్ని అస్థిరపరచగలనని బిజెపి పగటికలలు కంటోందని ఆయన అన్నారు. 

తాను బిజెపి ఆపరేషన్ ఆకర్ష్ కు లొంగిపోయేవాడిని కానని ఆనంద సింగ్ అన్నారు. తాను రాజీనామాల గురించి మీడియా ద్వారా తెలుసుకున్నానని, తనకు దానికి సంబంధించిన సమాచారమేదీ లేదని బిజెపి నేత యడ్యూరప్ప అన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో 20 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు ఉన్నారని తనకు సమాచారం ఉందని ఆయన అన్నారు.