ఒక్క సోషల్ మీడియా పోస్టు బెంగళూరు నగరంలో నానా బీభత్సం సృష్టించింది. ఆ పోస్టుకి వ్యతిరేకంగా కొందరు పౌరులు అల్లర్లు సృష్టించగా.. వాటిని అదుపు చేసేందుకు  పోలీసులు కూడా కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. అల్లర్లకు కారణమైన దాదాపు 110మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదంతా ఓ ఎమ్మెల్యే ఇంటి వద్ద చోటుచేసుకోవడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాజధాని బెంగళూరులోని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ మూర్తి నివాసం పై కొందరు పౌరులు దాడికి పాల్పడ్డారు. వెంటనే ఎమ్మెల్యే  ఈ విషయం పోలీసులకు తెలియజేయడంతో వారు అక్కడికి పరుగున వచ్చారు. అయితే.. వారు పోలీసుల పై రాళ్ల దాడి చేయడం గమనార్హం.

వాహ‌నాన్ని త‌గులబెట్టారు. ఈ నేప‌ధ్యంలో ప‌రిస్థితుల‌ను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు  జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ మూర్తి నివాసంతో పాటు బెంగళూరు తూర్పులోని కెజె హాలీ పోలీస్ స్టేషన్‌పై కూడా ఈ అల్ల‌రిమూక దాడి చేసింది. ఎమ్మెల్యే మేనల్లుడు సోష‌ల్ మీడియాలో చేసిన ఒక పోస్టును వ్య‌తిరేకిస్తూ, వీరు దాడికి పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. 

ఆందోళ‌న‌ల‌ను అదుపు చేసేందుకు పోలీసులు జ‌రిపిన కాల్ప‌ల్లో ఇద్ద‌రు మృతి చెందారు. కాగా ఈ విషయంపై దర్యాప్తు చేయాలని కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మయి ఆదేశాలు జారీ చేశారు. దాడికి పాల్ప‌డిన‌వారిపై క‌ఠిన చర్యలు తీసుకుంటామ‌న్నారు.