రెండు రోజుల పసికందును వందసార్లు స్క్రూడ్రైవర్ తో పొడిచి చంపిన ఘటన మధ్యప్రదేశ్ లో కలకలం రేపింది. వెన్నులో వణుకు పుట్టించే ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు దారి తీసింది. 

భూపాల్ లోని అయోధ్యనగర్ లో  ఓ గుడి సమీపంలో చుట్టి ఉన్న శాలువ కనిపించింది. ఆ శాలువ రక్తం మడుగులో ఉండడం స్థానికులు గమనించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. 

ఆ శాలువాలో ఓ పసికందు మృతదేహం ఉంది. అదికూడా ఏదో పదునైన ఆయుధంతో పొడిచి చంపినట్టుగా ఉంది. వెంటనే విచారణ ప్రారంభించగా ఆ పసికందు వయసు రెండు రోజులని, పదునైన స్క్రైడ్రైవర్ లాంటి దానితో చాలాసార్లు పొడిచి చంపారని తేలింది. పాప చనిపోయిందని తేలాకే అక్కడ పడేసారు. 

ఇలా ఎందుకు చేశారో పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించిన పోలీసులుదర్యాప్తు ప్రారంభించారు. సమీపంలో ఆస్పత్రుల్లో గత వారం రోజుల్లో జరిగిన కాన్పుల వివరాలను సేకరిస్తున్నారు. చిన్నారి హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.