Asianet News TeluguAsianet News Telugu

కేదార్‌నాథ్ వరదల్లో తప్పిపోయి.. ఐదేళ్ల తర్వాత తిరిగొచ్చిన దివ్యాంగురాలు

ఐదేళ్ల క్రితం ఉత్తరభారతాన్ని వణికించిన కేదార్‌నాథ్ వరదలు గుర్తున్నాయా.. 2013లో వచ్చిన వరదలు పవిత్ర కేదార్‌నాథ్ దేవాలయంతో పాటు సమీప ప్రాంతాల్లో బీభత్సాన్ని సృష్టించాయి. వందలాది మంది భక్తులు, ప్రజలు చనిపోగా, వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.

17 year old girl missing in kedarnath
Author
Kedarnath, First Published Dec 26, 2018, 1:50 PM IST

ఐదేళ్ల క్రితం ఉత్తరభారతాన్ని వణికించిన కేదార్‌నాథ్ వరదలు గుర్తున్నాయా.. 2013లో వచ్చిన వరదలు పవిత్ర కేదార్‌నాథ్ దేవాలయంతో పాటు సమీప ప్రాంతాల్లో బీభత్సాన్ని సృష్టించాయి. వందలాది మంది భక్తులు, ప్రజలు చనిపోగా, వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.

ఇదే సమయంలో ఎంతోమంది వరదనీటిలో చిక్కుకున్ని గల్లంతయ్యారు. వారి కోసం కన్నవారు కళ్లలో కాయలు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వరదల్లో తప్పిపోయిందనుకున్న తమ కుమార్తె తిరిగి కన్నవారిని కలుసుకుంది. మాములుగా అయితే చుట్టుపక్కల ఎవరినైనా అడగటమో లేదంటే ఎవరిద్వారానైనా అడిగి ఇంటికి చేరి ఉంటుంది అనుకోవడానికి ఆమె సాధారణ బాలిక కాదు మానసిక వికలాంగురాలు.

2013లో ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన చంచల్ అనే బాలిక కుటుంబసభ్యులు కేదార్‌నాథ్ దర్శనానికి వెళ్లారు. అయితే భారీ వరదల కారణంగా చంచల్ తన తల్లిదండ్రుల నుంచి విడిపోయి, దారి తప్పింది. అధికారుల సాయంతో ఎంతగానో వెతికినప్పటికీ చంచల్ జాడ తెలియరాలేదు.

దీంతో ఆశలు వదులుకుని ఆమె తల్లిదండ్రులు మాత్రం ఇంటికి చేరారు. వరదలు తగ్గుముఖం పట్టినతర్వాత దిక్కుతోచని స్థితిలో ఉన్న చంచల్‌ను ఓ పెద్దమనిషి చూశారు. ఎవరి తాలూకు అని అడగ్గా, తన వివరాలు చెప్పలేకపోయింది. దీంతో సదరు వ్యక్తి ఆమెను జమ్మూలోని ఓ అనాథాశ్రమం నిర్వాహకులకు అప్పగించాడు.

వీరు చంచల్‌ను కంటికిరెప్పలా కాపాడుతూ ఆమె ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నించారు.  ఈ క్రమంలో ఓ రోజు మాటల సందర్భంలో అలీగఢ్ ప్రస్తావన రావడంతో చంచల్‌లో ఓరకమైన ఆనందం కనిపించింది. దీనిని గమనించి నిర్వాహకురాలు.. అలీగఢ్‌లోని ఓ స్వచ్ఛంద సంస్థను సంప్రదించి వారికి విషయం తెలిపింది.

ఆ వివరాల ప్రకారం పోలీసుల సాయంతో ఆరా తీయగా.. చంచల్ ఎవరి బిడ్డో తెలిసిపోయింది. ఇక లేదనకున్న తమ కూతురు బతికే ఉందన్న విషయం తెలియడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios