న్యూఢిల్లీ: 17 మంది ఎంపీలకు కరోనా నిర్ధారణ అయింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను పురస్కరించుకొని ఎంపీలకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో 17 మందికి కరోనా సోకినట్టుగా ఈ పరీక్షల్లో తేలింది.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమయ్యాయి.ఈ సమావేశాలను పురస్కరించుకొని ఎంపీలు, సిబ్బందికి, సెక్యూరిటీ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఈ సమావేశాలకు ముందుగానే పరీక్షలు చేశారు.మొత్తం 17 మంది ఎంపీల్లో అత్యధికంగా 12 మంది బీజేపీ ఎంపీలకు కరోనా నిర్ధారణ అయినట్టుగా రిపోర్టులు చెబుతున్నాయి.వైసీపీకి చెందిన ఇద్దరు, కాంగ్రెస్ నుండి 2 , శివసేన, డీఎంకే, ఆర్ఎల్పీ నుండి  ఒక్కొక్క ఎంపీకి కరోనా సోకినట్టుగా వైద్యులు ప్రకటించారు.

కరోనా సోకిన ఎంపీలను హోం క్వారంటైన్ లోనే ఉండాలని వైద్యులు సూచించారు. కరోనా నుండి కోలుకొన్న తర్వాత ఎంపీలను పార్లమెంట్ సమావేశాలకు అనుమతిస్తారు. 

దేశంలో కరోనా కేసులు 48 లక్షల 45 వేల 003కి చేరుకొన్నాయి. గత 24 గంటల్లో కరోనా కేసులు 93,215 నమోదయ్యాయి. దేశంలో 9,73,175 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా కేంద్రం తెలిపింది.

కరోనా కేసుల్లో ఇండియా రెండో స్థానంలో కొనసాగుతోంది. అమెరికా తర్వాతి స్థానంలో ఇండియా కొనసాగుతోంది. 2021 వరకు దేశంలో కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఆదివారం నాడు ప్రకటించిన విషయం తెలిసిందే.