ఉపఎన్నికల్లో ఏకమైన విపక్షాలు: బిజెపికి ఎదురుదెబ్బ

14 bypolls' results today to be a big test for united opposition
Highlights

బైపోల్ రజల్ట్స్: కమలానికి షాకిచ్చిన విపక్షాలు

న్యూఢిల్లీ:బిజెపిని నిలువరించేందుకు విపక్షాలు ఏకతాటిపైకి రావడంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కమలానికి  ఎదురుదెబ్బ తగిలింది. కేవలం ఒక్క ఎంపీ, ఒక్క అసెంబ్లీ స్థానానికి మాత్రమే ఆ పార్టీ పరిమితం కావాల్సి వచ్చింది.నాలుగు సిట్టింగ్ ఎంపీ స్థానాల్లో బిజెపి కేవలం ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.విపక్షాల అనైక్యత కారణంగానే బిజెపి మహరాష్ట్రలోని ఒక్క ఎంపీ స్థానాన్ని దక్కించుకొందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

దేశంలోని  పలు రాష్ట్రాల్లోని 4 ఎంపీ, 11 అసెంబ్లీ స్థానాలకు  జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపిని విపక్షాలు నిలువరించాయి. విపక్షాలు ఏకమయ్యాయి. ఓట్ల చీలిక ఏర్పడకుండా చేసిన ఫ్రయత్నం ఫలించింది. దీంతో బిజెపికి  ఈ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైంది. ఈ స్థానంలో శివసేన, బిజెపి అభ్యర్ధుల మధ్య ముఖాముఖి పోటీ నెలకొంది. శివసేన అభ్యర్ధిపై బిజెపి విజయం సాధించింది.ఇదే రాష్ట్రంలోని బందారియా-గోండియా ఎంపీ స్థానంలో  ఎన్సీపీ అభ్యర్ధి విజయం సాధించారు. 

ఇక యూపీ రాష్ట్రంలోని కైరానా ఎంపీ స్థానంలో బిజెపి తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. బిజెపి అభ్యర్ధిపై ఆర్ఎల్డీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఈ స్థానంలో ఎస్పీ, బిఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఆర్‌ఎల్డీ అభ్యర్ధికి మద్దతిచ్చాయి. దీంతో బిజెపికి యూపీలో వరుసగా పరాజయాలు ఎదురౌతున్నాయి. ఇటీవల జరిగిన గోరఖ్‌పూర్ ఎంపీ స్థానంలో ఎస్పీ అభ్యర్ధి విజయం సాధించారు. ఆ స్థానానికి గతంలో ప్రస్తుత యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ ప్రాతినిథ్యం వహించారు. కానీ, తాజాగా వెల్లడైన కైరానా స్థానంలో బిజెపి ఓడించేందుకు విపక్షాలు చేసిన ప్లాన్ మరోసారి ఫలితాన్ని ఇచ్చింది. నాగాలాండ్ లో ఎన్ డి పిపి అభ్యర్ధి విజయం సాధించారు.


ఇక అసెంబ్లీ సీట్ల వారీగా చూస్తే బిజెపికి కేవలం ఒక్క అసెంబ్లీ సీటు మాత్రమే దక్కింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తరలి సీటును మాత్రమే ఆ పార్టీ దక్కించుకొంది. అయితే ఈ స్థానంలో కూడ బిజెపి, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. కానీ, చివరకు ఈ స్థానంలో బిజెపికి విజయం దక్కింది.

మేఘాలయ రాష్ట్రంలోని అంపటి స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధి విజయం సాధించారు.  బెంగాల్ లోని మహేస్తలలో టీఎంసీ విజయం సాధించింది.ఈ నియోజకవర్గలో  సీపీఎం ను నెట్టివేసి బిజెపి రెండో స్థానంలో నిలిచింది..మహరాష్ట్రలోని పాలస్ కడేగావ్ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది.కర్ణాటకలోని రాజరాజేశ్వరీ నగర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగానే బిజెపి అభ్యర్ధి కౌంటింగ్ సెంటర్ నుండి వెళ్ళిపోయాడు. 

కేరళ రాష్ట్రంలోని చెంగన్నూరులో సీపీఎం విజయం సాధించింది.ఈ స్థానాన్ని సిపీఎం నిలబెట్టుకొంది. యూపీలోని నూర్పూర్ అసెంబ్లీ స్థానంలో ఎస్పీ అభ్యర్ధి తన సమీప బిజెపి అభ్యర్ధిపై విజయం సాధించారు. సిట్టింగ్ స్థానాన్ని బిజెపి కోల్పోయింది.బీహర్ రాష్ట్రంలోని జోకిహాట్ స్థానంలో అధికార జెడి(యూ) సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఈ స్థానంలో ఆర్జేడీ అభ్యర్ధి సుమారు 10 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు.సిల్లీ స్థానంలో జెఎంఎం అభ్యర్ధి విజయం సాధించారు. గోమియా స్థానంలో కూడ జెఎంఎం అభ్యర్ధి విజయం సాధించారు.ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తరలి అసెంబ్లీ స్థానంలో బిజెపి విజయం సాధించింది. పంజాబ్ రాష్ట్రంలోని షాకోట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధి విజయం సాధించారు.


బీహార్ రాష్ట్రంలోని ఆర్జేడీ నుండి పాలకపక్షమైన నితీష్ కుమార్ కు షాక్ తగిలింది. గత ఎన్నికల సమయంలో ఆర్జేడీ, జెడి(యూ),కాంగ్రెస్ పార్టీ కూటమిగా పోటీ చేసి ఘన విజయాన్ని సాధించాయి. అయితే ఆర్జీడీ నుండి దూరమైన నితీష్ బిజెపితో కలిసి ప్రస్తుతం ప్రభుత్వంలో కొనసాగుతున్నాడు. తాజాగా వచ్చిన ఎన్నికల ఫలితాలు నితీష్ కు గుణపాఠమని ఆర్జేడీ నేతలు చెబుతున్నారు.

దక్షిణాదిలో బిజెపికి స్థానం దక్కకుండా చేయాలనే ఉద్దేశ్యంతో కర్ణాటకలో బిజెపిని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా విపక్షాలు ఏకమయ్యాయి. దీంతో కర్ణాటకలో జెడి(ఎస్) నేత కుమారస్వామి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. కర్ణాటకలో అవలంభించిన ఫార్మూలానే ఉప ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో బిజెపియేతర పార్టీలు అవలంభించాయి. ఈ ఫార్మూలా బిజెపికి  తీవ్రంగా నష్టాన్ని కల్గించింది.

loader