గుజరాత్ పోర్టు మరోసారి కలకలం రేపింది. గతంలో ముంద్రా పోర్టులో సుమారు 3000 వేల హెరాయిన్‌ను టాల్కమ్ పౌడర్ రూపంలో లభించి దేశవ్యాప్తంగా చర్చను లేవదీసిన సంగతి తెలిసిందే. తాజాగా, గుజరాత్ కచ్ జిల్లాకు చెందిన కాండ్లా ఎయిర్‌పోర్టులో సుమారు 260 కిలోల హెరాయిన్‌ను అధికారులు పట్టుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు 1,300 కోట్లు అని నిపుణులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ: అక్రమంగా డ్రగ్స్ రవాణా చేసే మాఫియాకు గుజరాత్ పోర్టులో ఫేవరేట్లుగా మారాయా? ఇటీవలే ముంద్రా పోర్టులో భారీగా డ్రగ్స్ సీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, మరోసారి అదే రాష్ట్రానికి చెందిన కాండ్లా పోర్టులో సుమారు 260 కిలోల హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా చేపట్టిన తనిఖీలలో ఈ భారీ డ్రగ్స్ వెలుగుచూసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ డ్రగ్స్ విలువ సుమారు 1,300 కోట్లు అని నిపుణులు
చెబుతున్నారు.
ముందస్తుగా ఈ డ్రగ్స్ రవాణా గురించి సమాచారం అందగానే ఏటీఎస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ కచ్ జిల్లాలోని కాండ్లా పోర్టులో సంయుక్తంగా తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో ఓ భారీ కంటైనర్‌లో డ్రగ్స్ ఉన్నట్టు పసిగట్టారు. ఏటీఎస్ డీఐజీ దీపన్ భాంద్ర ఈ డ్రగ్స్ పట్టివేతపై స్పందించారు. ఏటీఎస్, డీఆర్ఐ కాండ్లా పోర్టులో సంయుక్తంగా చేపట్టిన రైడ్‌లో హెరాయిన్ పట్టుకున్నట్టు వెల్లడించారు. ఎంత మొత్తంలో పట్టుబడిందో.. దాని విలువ ఎంతో చెప్పడానికి ఆయన నిరాకరించారు. కానీ, ఆ డ్రగ్స్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈ పోర్టుకు చేరినట్టు వివరించారు.
చివరిసారిగా కూడా ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్ నుంచి ఇరాన్‌కు చెందిన ఓ పోర్టు నుంచి సుమారు 3000 కిలోల హెరాయిన్ సెమీ ప్రాసెస్డ్ పౌడర్ రూపంలో గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు వచ్చింది. ఈ డ్రగ్స్ డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఆ డ్రగ్స్‌ను విజయవాడకు చెందిన ఆషి ట్రేడింగ్ కంపెనీ ఆర్డర్ చేసినట్టు తేలింది. ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసులో 11 మంది ఆఫ్ఘన్లు, నలుగురు ఇండియన్లు, ఒక ఇరానియన్‌పై కేసు నమోదైంది.
కాగా, ఈ డ్రగ్స్ వ్యవహారం ముందుకు రాగానే ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ ముంద్రా పోర్టును నిర్వహించేది అదానీ గ్రూప్స్ వారే కావడంతో విమర్శలు వచ్చాయి. దీంతో అదానీ గ్రూప్స్ ఓ ప్రకటన వెలువరించింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్‌ల నుంచి ఇక మీదట ఎలాంటి కార్గోను కూడా స్వీకరించబోమని ప్రకటించింది.
పౌడర్ రూపంలో డ్రగ్స్ ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్ నుంచి ముంద్రా పోర్టుకు చేరింది. ఇరాన్ మీదుగా ఈ డ్రగ్స్‌ను విజయవాడకు చెందిన ఓ సంస్థ ఆర్డర్ చేసింది. ఈ డ్రగ్స్ పై ముందస్తు సమాచారాన్ని కలిగి ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు చేయగా సుమారు మూడు వేల కిలలో హెరాయిన్ పట్టుబడింది. అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర రూ. 21వేల కోట్లు పలుకుతుందని అంచనా. ఈ డ్రగ్స్ పట్టివేత దేశాన్ని కుదిపేసింది. అదానీ సంస్థలపైనా విమర్శలు వచ్చాయి.
