న్యూఢిల్లీ: నది నీళ్లలో కొట్టుకుపోతున్న 22 ఏళ్ల యువకుడిని 12 ఏళ్ల బాలుడు కాపాడాడు. యువకుడిని కాపాడిన బాలుడిని పలువురు ప్రశంసించారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

రాష్ట్రంలోని రామనగర్ లో ఈ ఘటన చోటు చేసుకొంది. బ్రిడ్జి పై నుండి కోసి నదిలో ఓ యువకుడు బైక్ తో సహా కొట్టుకుపోయాడు. అయితే ఆ యువకుడిని కాపాడేందుకు 12 ఏళ్ల యువకుడు నదిలోకి దూకి ఆ యువకుడిని కాపాడాడు.

రవి కాశ్యప్ అనే 22 ఏళ్ల యువకుడు మోతీమహల్ రామనగర్ లోని మోతీ మహల్ వద్ద నివాసం ఉంటున్నాడు. మెంటల్ స్ట్రెస్ కారణంగా కోసి బైపాస్ బ్రిడ్జి నుండి 40 అడుగుల లోతులో ఉన్న నదిలోకి దూకాడు.

కాశ్యప్ నదిలో దూకిన సమయంలో చాలా మంది ఈ దృశ్యాన్ని చూసి అరిచారు. కానీ అతడిని కాపాడేందుకు ఎవరూ కూడ ముందుకు రాలేదు. కానీ 12 ఏళ్ల సన్నీ అనే బాలుడు కాశ్యప్ ను కాపాడేందుకు నదిలోకి దూకాడు.  సన్నీ 8వ తరగతి చదువుతున్నాడు. 

కోసి నదిలో కొట్టుకుపోతున్న కాశ్యప్ ను సన్నీ పట్టుకొన్నాడు. నది నీటిలోని  ఓ అంచు వద్దకు కాశ్యప్ ను తీసుకొచ్చాడు. అక్కడే అతడిని పట్టుకొని నిలబడ్డాడు.
ఈ దృశ్యాలను కొందరు తమ సెల్ ఫోన్లను రికార్డు చేశారు. ఈ విషయం తెలిసిన పోలీసులు, స్థానికులు వారిద్దరిని సురక్షితంగా నది నుండి బయటకు లాగారు.

పోలీసు ఉన్నతాధికారులు సన్నీని అభినందించారు.  నదికి సమీపంలో ఈ కుటుంబం నివాసం ఉంటుంది. నదిలో తరచూ ఈత కొట్టేవాడు సన్నీ. దీంతో నది ప్రవాహనికి కూడ ఎదురీదగలడు సన్నీ. 

ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే దివాన్ సింగ్ బిష్ట్ తనయకుడు జగ్మోహన్ సింగ్ సన్నీని అభినందించారు. కాశ్యప్ కు సన్నీ కొత్త జీవితాన్ని ఇచ్చాడన్నారు.