రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10మంది మృత్యువాత పడిన సంఘటన ఝార్ఖండ్ లో చోటుచేసుకుంది.  రామ్ గఢ్ జిల్లాలో శనివారం ఈ ప్రమాదం జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... రామ్ గఢ్ జిల్లాలోని జాతీయ రహదారి 33 పై ఎదురెదురుగా వస్తున్న లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులోని పదిమంది మృత్యువాత పడ్డారు. వారంతా బిహార్ నుంచి రాంచీ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది.

మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ ప్రమాదస్థలి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంతో ప్రయాణించడం కారణంగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.