భోపాల్: కల్తీ మద్యం సేవించి పదిమంది మృతిచెందగా ఇంకా పలువురు తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న దుర్ఘటన మధ్య ప్రదేశ్ లో చోటుచేసుకుంది.  గ్వాలియర్,మోరెనా జిల్లాల్లోని పలు గ్రామాలకు కల్తీ మద్యం సరఫరా అయ్యింది. దీన్ని సేవించిన వారిలో కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు ప్రాణాపాయస్థితిలో వున్నారు. 

మోరెనా జిల్లాలోని మ‌న్‌పూర్ పృథ్వీ, ప‌హ‌వాలి గ్రామాల్లో మొదట ఈ కల్తీ మద్యం మరణాలు సంభవించారు. ఆ తర్వాత గ్వాలియర్ లో కూడా ఈ కల్తీ మద్యం మరణాలు సంభవించాయి. రెండు రోజుల క్రితం మద్యాన్ని సేవించిన వారు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఇలా అనారోగ్యానికి గురయిన వారిలో పదిమంది మరణించారు. 

హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారిలో కూడా పలువురి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృత‌దేహాల‌ పోస్టుమార్టం రిపోర్ట్స్ వస్తే వారి మ‌ర‌ణాల‌కు గ‌ల కార‌ణాలు తెలిసే అవ‌కాశం ఉంద‌ని పోలీసులు పేర్కొన్నారు.