టీం ఇండియా ఓటమి కి కారణం... వాళ్లు ధరించిన ఆరెంజ్ కలర్ జెర్సీనే అంటూ జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా... ఆమె చేసిన కామెంట్స్ పై ఇప్పుడు నెటిజన్లు మండిపడుతున్నారు. 

ఇంతకీ మ్యాటరేంటంటే.... ప్రపంచకప్ లోభాగంగా ఆదివారం ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా ఓటమిపాలయ్యింది. ఈ మ్యాచ్ లో టీం ఇండియా ఆరెంజ్ కలర్ జెర్సీ ధరించింది. ఆ రంగు జెర్సీ కారణంగానే జట్టు ఓడిపోయిందని ముఫ్తీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

‘ నన్ను మూఢనమ్మకస్తురాలు అనుకున్నా సరే. ఏదైమైనా ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమికి జెర్సీనే కారణం’ అని ట్వీట్‌ చేశారు. అదేవిధంగా అంతకుముందు..‘ ఇంగ్లండ్‌పై టీమిండియా గెలవాలని పాకిస్తాన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. కనీసం క్రికెట్‌ కారణంగానైనా రెండు దేశాలు ఒకే తాటిపైకి వచ్చాయి’ అని ముఫ్తి ట్విటర్‌లో పేర్కొన్నారు. 

ఈ క్రమంలో.. ‘మీ మనసులో ఏముందో తెలిసిపోయింది. పాకిస్తాన్‌ కోసమే మీరు ఇలా మాట్లాడుతున్నారు. అవును.. ఎన్నికల్లో మీరు ఏ రంగు జెర్సీ ధరించారు’ అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇదే ఘటనపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ ఆరెంజ్‌ జెర్సీ కారణంగానే భారత్‌ ఓడిపోయిందని అంటున్నారు. పాకిస్తాన్‌ ఎల్లప్పుడు ఆకుపచ్చ జెర్సీనే ధరిస్తుంది కదా. మరి వాళ్లెందుకు ఓడిపోతున్నారు. బహుశా మత గురువుల్లా పొడవాటి గడ్డాలు పెంచుతున్నందుకే వారు ఓడిపోతున్నారామో. భారత్‌ పేరును నాశనం చేసేందుకే ఇలాంటి కొంత మంది వ్యక్తులు కంకణం కట్టుకున్నారు’ అని మండిపడ్డారు.