న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెసు సీనియర్ నేత వీరప్ప మొయిలీ తీవ్రంగా స్పందించారు. పార్టీ పునరుద్ధరణకు సర్జికల్ యాక్షన్ చేపట్టాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు ఖాతా కూడా తెరవలేదు. 2015లోనూ ఒక్క సీటు కూడా గెలువలేదు.

అయితే, ఓట్ల శాతం మాత్రం మరింతగా పడిపోయింది. 2015లో కాంగ్రెసుకు 9.7 శాతం ఓట్లు రాగా ఈ ఎన్నికల్లో కేవలం 4.27 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. తమ పార్టీ ఓటు బ్యాంక్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మళ్లడం వల్ల తమ పార్టీ ఘోరంగా దెబ్బ తిన్నదని, బిజెపిని ఓడించే సత్తా ఆప్ నకు ఉందని ప్రజలు నమ్మి అటు ఓటు వేశారని ఆయన అన్నారు. 

కాంగ్రెసును బలపరచడం వల్ల ఉపయోగం లేదని, కాంగ్రెసును బలపరిస్తే బిజెపి గెలిచే అవకాశాలున్నాయని అనుకుని ఆప్ కి ఓటేశారని ఆయన అన్నారు. ఢిల్లీ ప్రజలు కాంగ్రెసును సీరియస్ గా తీసుకోలేదని, తమకు వస్తాయని అనుకున్న ఓట్లన్నీ ఆప్ కి పడ్డాయని ఆయన చెప్పారు. 

పార్టీని పునర్నిర్మించాల్సిన, పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఎవరో ఒకరిద్దరి నేతల వైపు వేలెత్తి చూపలేమని, ప్రతి కాంగ్రెసు నేత, కార్యకర్త బాధ్యత తీసుకోవాలని ఆయన అన్నారు.