న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ద విమానాల  ఒప్పందంపై లోక్‌సభలో శుక్రవారం నాడు  వాడీ వేడీగా చర్చ సాగింది. అధికార పక్షాన్ని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ తూర్పారబట్టారు.రాహుల్ వ్యాఖ్యలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కౌంటర్ ఎటాక్  చేశారు.

రాఫెల్ యుద్ద విమానాల ఒప్పందాన్ని ఆది నుండి  కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. ఈ ఓప్పందంలో  పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని రాహుల్ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. లోక్‌సభ వేదికగా మరోసారి రాహుల్ గాంధీ ఈ అంశాన్ని మరోసారి లేవనెత్తారు.

రాఫెల్ డీల్‌లో విమాన ధర భాగం కాదని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తెలిపారని పార్లమెంట్‌లో రాహుల్ ప్రస్తావించారు. హెచ్ఎఎల్‌ను తప్పించి అనిల్ అంబానిని ఎవరు తీసుకొచ్చారన్న రాహుల్ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు కేంద్రం నుండి సమాధానం లేదని  రాహుల్ విమర్శించారు.

పొరుగు దేశాలతో ప్రమాదం ఉంటే  126 నుండి 36 విమానాలకు ఎందుకు తగ్గించారని ఆయన ప్రశ్నించారు. విమానాల ధరను ఎవరు పెంచారో, ఎందుకు పెంచాల్సి వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాఫెల్ డీల్‌ విషయంలో అధికార పార్టీ తీరును రాహుల్ తప్పు బట్టడంతో  విపక్షాల ప్రశ్నలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కౌంటర్ ఇచ్చారు.

యుద్ధ విమానాల సంఖ్యను తాము తగ్గించలేదని యూపీఏ ఒప్పందం చేసుకున్న 18 విమానాల నుంచి 36 విమానాలకు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. పొరుగు దేశాలు చైనా, పాకిస్థాన్ ఆయుధ బలాన్ని రెట్టింపు చేసుకుంటూ పోతుంటే ఎందుకు ఈ విమానాలను తీసుకురాలేదో చెప్పాలని నిర్మల సీతారామన్ ప్రశ్నించారు.