--సూర్య ప్రకాష్ జోశ్యుల
 

సాధారణంగా సినిమా కథల్లో యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటూంటాయి. కానీ యాక్షన్ సీన్స్ మధ్యలో సినిమా కథ ఉంటే అది ‘యాక్షన్’ సినిమా అవుతుంది. అవును.. సుందర్. సి .. సినిమాలు కామెడీ ప్రధానంగా సాగుతూంటాయి. కొన్ని కామెడీ ఎపిసోడ్స్ అనుకుని..దానికి తగ్గ కథ వాటి చుట్టూ అల్లినట్లు ఉంటూంటాయి. ఈ సారి స్కీమ్ మార్చి ... కామెడీ బదులు యాక్షన్ సీన్స్ తో సినిమా తీసాడంతే. మరి ఆ యాక్షన్ ఎపిసోడ్స్ మధ్యన ఇమిడిన కథేంటి...సినిమా చూసేటట్లు ఉందా...ఏదో తమిళ డబ్బింగ్ సినిమా అని లైట్ తీసుకునేటట్లు ఉందా వంటి విషయాలు చూద్దాం.
 
కథేంటి..


ముఖ్యమంత్రి కుమారుడు,ఆర్మీ కల్నల్ అయిన విశాల్(సుభాష్) జీవితంలో ఓ పెద్ద విషాదం చోటు చేసుకుంటుంది. తన తండ్రి పార్టీ మీటింగ్ లో జరిగిన బాంబ్ పేలుడు లో తను ప్రేమించిన అమ్మాయి మీరా(ఐశ్వర్య లక్ష్మి)ని కోల్పోతాడు. అంతేకాదు..ఓ జాతీయ నాయకుడు చనిపోతాడు. దాంతో ఆ ఎటాక్ కు సుభాష్ కుటుంబానికి సంబంధం ఉందని ఆరోపణలు వస్తాయి. అవి తట్టుకోలేక కాబోయే ముఖ్యమంత్రి అయిన అన్న (రాంకి) ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ క్రమంలో తన కుటుంబంపై పడిన మచ్చను తొలిగించాలి...తన ప్రేయసి చావుకు కారణమైన వాళ్లను మట్టుపెట్టాలని అని నిర్ణయించుకుంటాడు. అతనికి ఆర్మీ కోలిగ్ దివ్య (తమన్నా)సాయం చేయటానికి ముందుకు వస్తుంది. అక్కడ నుంచి వాళ్లిద్దరు కలిసి ఏ సాహసాలు చేసి అసలు ఈ  పేలుళ్లు వెనక ఉన్న వ్యక్తులను పట్టుకున్నారు. వాళ్లెవరు...అసలు ఈ పేలుళ్లకు కారణమేంటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్..

స్టోరీ లైన్ గా చూస్తే తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి, ప్రతీకారం తీర్చుకున్న  హీరో కథ ఇది. అయితే దీన్ని ట్రీట్మెంట్ తో ఎంత అందంగా తీర్చిద్దిదారన్నదే ప్రధానం.  ఈ వన్ లైన్ ప్లాట్ ని ...టైటిల్ కు తగ్గట్లు దర్శకుడు సినిమాని పూర్తిగా యాక్షన్ బేసెడ్ గా తీర్చి దిద్దాడు. సినిమా ప్రారంభమే ఓ యాక్షన్ ఎపిసోడ్ తో ప్రారంభించి కథలోకి వెళ్లి ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ఇంటర్వెల్ ఇచ్చాడు. అలాగే సెకండాఫ్ లో కూడా యాక్షన్ పార్ట్ కే ప్రయారిటీ ఇచ్చారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లను చాలా బాగా డిజైన్ చేసారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాలో యాక్షన్ సీన్స్ ని ఇవి గుర్తు చేస్తాయి. ఇంటర్వెల్ దగ్గర వచ్చే సీక్వెన్స్ అయితే అద్బుతం అనిపిస్తుంది. ఊపిరి బిగపట్టి చూసేలా చేస్తుంది. ఆ మధ్యన వచ్చిన బాలీవుడ్ చిత్రం బేబి ఛాయిలు సినిమాలో చాలా కనిపిస్తాయి. అలాగే సెకండాఫ్ మొత్తం తెలుగులో వచ్చిన గోపిచంద్ చాణుక్య కూడా గుర్తు చేస్తుంది. లాహోర్ లో ఉన్న దావూద్ ఇబ్రహీం టైప్ ఓ పవర్ ఫుల్ వ్యక్తిని ఇండియా తీసుకొచ్చే క్రమం సహజత్వానికి దూరంగా అనిపించినా...తెరపై చూస్తూంటే ఓకే అనిపిస్తుంది. అయితే యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నంతగా మిగతా సీన్స్ ఉండవు. అవి చుట్టేసినట్లు కనపడతాయి.
 
ఎవరెవరు ఎలా చేసారంటే...

 హీరోయిన్ గా నటించిన తమన్నా యాక్షన్ సీన్స్ లో తన సత్తా ఏంటో చూపించింది. అయితే బికినీ సీన్స్ లో బాబోయ్ అనిపించింది. ఇంకో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ కూడా కనిపించిన కాసేపు క్యూట్ గా బాగుంది. రాంకీ క్యారక్టర్ సోసో.

స్క్రిప్టు పరంగా చూస్తే...హై యాక్షన్ ఎంటర్ టైనర్ గా థ్రిల్లింగ్ ప్లేతో సాగే ఈ సినిమా, ట్విస్ట్ లు అండ్ యాక్షన్ బాగానే ఉన్నా... చాల చోట్ల లాజిక్ మిస్ అయ్యింది. ఇక  డుడ్లీ సినిమాటోగ్రఫీ వర్క్ కేక పుట్టించింది. యాక్షన్ సీన్స్ ని అదరకొట్టారు. శ్రీకాంత్ ఎడిటింగ్ కూడా లాగ్ లు లేకుండా చాలా బాగుంది. అయితే ఫ్యామిలీ సీన్స్ ను సాధ్యమైనంత వరకు ట్రిమ్ చేసి ఉంటే.. ఇంకా బాగుండేది.

ఇక సంగీత దర్శకుడు హిప్‌హాప్‌ తమీజా సమకూర్చిన పాటలు ఓకే.  రీరికార్డింగ్ కూడా యాక్షన్ సీన్స్ కు తగినట్లు ఉంది. డబ్బులు బాగా ఖర్చుపెట్టారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

ఫైనల్ థాట్..


ఇలాంటి సినిమాలు చేస్తే... డైరక్టర్స్ కు సుఖం. మొత్తం యాక్షన్ ఎపిసోడ్సే కాబట్టి...యాక్షన్ కొరియాగ్రాఫర్సే డైరక్ట్ చేసుకుంటూ పోతారు.

 Rating : 2.5/5

ఎవరెవరు..
నటీనటులు: విశాల్‌, తమన్నా, ఐశ్వర్య లక్ష్మి, ఆకాంక్షా పూరి, ఛాయా సింగ్‌, యోగిబాబు, ఆనందరాజ్‌ తదితరులు
దర్శకుడు: సి. సుందర్‌
నిర్మాత: ఆర్‌. రవీంద్రన్‌
కూర్పు: ఎన్‌.బి. శ్రీకాంత్‌
సంగీత దర్శకుడు: హిప్‌హాప్‌ తమిళ
విడుదల తేదీ: 15-11-2019