Asianet News TeluguAsianet News Telugu

Meeku Matrame Cheptha: మీకు మాత్రమే చెప్తా మూవీ రివ్యూ

‘మన లైఫ్‌ మన చేతిలో ఉంటుందో లేదో కానీ... అది  ఖచ్చితంగా మన  చేతిలోనో ఖర్మకాలితే వేరే వాడి చేతిలోనో ఉండే ఫోన్ లో మాత్రం ఉంటుంది’.ఇది ఈ డిజిటల్ యుగంలో అందరూ నమ్మే సత్యం. 

Tharun Bhascker's MEEKU MATHRAME CHEPTHA movie REVIEW
Author
Hyderabad, First Published Nov 1, 2019, 1:09 PM IST

 

---సూర్య ప్రకాష్ జోశ్యుల

‘మన లైఫ్‌ మన చేతిలో ఉంటుందో లేదో కానీ... అది  ఖచ్చితంగా మన  చేతిలోనో ఖర్మకాలితే వేరే వాడి చేతిలోనో ఉండే ఫోన్ లో మాత్రం ఉంటుంది’.ఇది ఈ డిజిటల్ యుగంలో అందరూ నమ్మే సత్యం.  సెల్ ఫోన్ లో ఉండే  వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా యాప్స్ తో   పాటు కొన్ని సీక్రెట్ వీడియోలు ఉండటం అనేది సర్వ సామాన్యమైన విషయం అయ్యిపోయింది. దాంతో పొరపాటున ఫ్రెండ్స్ కానీ, ఇంట్లో వాళ్లు కానీ ఆ వీడియోలు చూస్తారేమో, సెల్ వేరే వాళ్ల చేతిలో పడితే వీడియో లీక్ అవుతుందనే భయం కూడా అదే సమయంలో వెంటాడుతోంది.

ఈ  వర్రీ పాయింట్ ని తీసుకుని సినిమా చేస్తున్నారంటే ఖచ్చితంగా  చూడాలనిపిస్తుంది. దానికి తోడు విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్... వీళ్లద్దరి సినిమా అంటే మరీను. ఈ నేపధ్యంలో రిలీజైన ఈ చిత్రం స్టోరీ లైన్ ఏంటి, బాగా నవ్వించారా, విజయ్ దేవరకొండ నిర్మాతగా మారేటంత సీన్ ఉన్న సినిమాయేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

Tharun Bhascker's MEEKU MATHRAME CHEPTHA movie REVIEW

స్టోరీ లైన్..

అలా జరుగుతుందని అతనూ అనుకోలేదు...ఎవరూ అనుకోరు. కానీ సరిగ్గా అలాగే జరిగింది. ఓ వీడియో ఒక మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తుందని చెప్తే అంతకు ముందు నమ్మోవాడు కాదేమో కానీ నమ్మాల్సిన చిత్రమైన పరిస్దితి వచ్చింది. అతను పేరు రాకేష్ (తరుణ్ భాస్కర్). ఓ టీవీ ఛానెల్ లో పనిచేస్తున్న అతను  తను ఎంతగానో ఇష్టపడే  అమ్మాయి డాక్టర్ స్టెఫీ (వాణి భోజన్‌)ను పెళ్లాడేందుకు ప్రిప‌రేష‌న్స్ లో బిజీగా, హ్యాపీగా ఉంటాడు. ఈలోగా ఆ ఆనందాన్ని ఆర్పేస్తూ ఓ షాకింగ్ వీడియో అతని సెల్ దిగుతుంది. అది ఓ ప్రెవేట్ వీడియో. ఆ వీడియో కనుక లీక్ అయి బయిటకు వెళ్లిందా తన పెళ్లి ఆగిపోతుంది.

 ఆ వీడియో ఏమిటీ అంటే....తాను  ఉద్యోగ ధర్మంలో భాగంగా ఒక ద‌ర్శకుడి సలహాతో హానీమూన్ నేప‌థ్యంలో సాగే ‘మ‌త్తు వ‌ద‌ల‌రా, నిద్దుర మ‌త్తు వ‌ద‌లరా’ అంటూ చేసిన వీడియో.   అయితే  తాను ఎంతో మంచి వాడిన‌ని, ఎటువంటి హాబిట్స్  లేనివాడినని  స్టెఫీకి చెప్పి పెళ్లికి ఒప్పించిన రాకేష్‌కు ఆ వీడియో చిక్కులు వస్తాయనిపిస్తుంది. ఎందుకంటే అది అడల్ట్ కంటెంట్ తో ఉంటుంది. చూస్తేనేమో మరి కొద్ది గంటల్లోనే పెళ్లి ఉంది.

దాంతో ఎలాగైనా ఆ వీడియోని ఆపేయాలి అని ఫ్రెండ్ కామేష్ (అభిన‌వ్ గౌతమ్‌)   తో కలిసి యుద్దం స్టార్ట్ చేస్తాడు. తన హ్యాకర్ ఫ్రెండ్ సాయింతో ఆ వీడియో ఎవరు లీక్ చేసారో కనుక్కుంటారు. అయితే ఈ లోగా ఆ హ్యాకర్ ఫ్రెండ్ సిస్టర్ అయిన అనసూయ కు ఈ లీక్ వీడియో సంగతి తెలుస్తుంది. దాంతో ఆ వీడియో గురించిన నిజం పెళ్లి చేసుకోబోయే వాణికు చెప్పేయమంటుంది. లేదా తనే చెప్పేస్తానని బెదిరిస్తుంది. ఆమె ను కన్వీన్స్ చేసి మొత్తానికి ఆ వీడియో అప్ లోడ్ చేసిన వారిని పట్టుకుని , దాన్ని డిలేట్ చేసి, హమ్మయ్య అని నిట్టూరుస్తారు.

అయితే ఈ లోగా వీళ్లకోసం మరో ట్విస్ట్ వెతుక్కుంటూ వస్తుంది. మరో వీడియో అప్ లోడర్ తన దగ్గర వీడియో ఉందని , దాన్ని ఇరవై లక్షలు ఇస్తే డిలేట్ చేస్తామని కాల్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తాడు. వేరే దారి లేక ...సర్లే అని డీల్ ఫైనలైజ్ చేసుకుంటారు. మరో ప్రక్క పెళ్లి ప్రిపరేషన్స్ జరుగుతూంటాయి. అయితే ఈ లోగా సెల్ఫీ తీసుకుంటానని రాకేష్ దగ్గర నుంచి ఫోన్ తీసుకున్న స్టెఫీ అందులో వీడియోని చూసేస్తుంది. దాంతో మళ్లీ సమస్య వచ్చి పడుతుంది. పెళ్లి ఆగిపోయే సిట్యువేషన్. అప్పుడు ఆ వీడియో గురించిన ఓ నిజం బయిటకు వస్తుంది. ఆ నిజం ఏమిటి..ఆ హ్యాకర్ ఎవరో కనిపెట్టారా...చివరకు  వాణీతో రాకేష్ పెళ్లి అయ్యిందా లేదా? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


కథ,కథనం ఎలా ఉన్నాయంటే...

Tharun Bhascker's MEEKU MATHRAME CHEPTHA movie REVIEW

నటీ నటుల్లో.. మనకు తరుణ్ భాస్కర్, అనసూయ తప్ప వేరే వారెవరూ.. పెద్దగా తెలీయకపోయినా.. విజయ్  దేవరకొండ ప్రొడ్యూస్ చేసిన సినిమా కావడంతో.. ఎక్సపెక్టేషన్స్ ఏర్పడ్డాయి. అంతేకాకుండా.. దీనికి తగ్గట్టుగానే యూత్ న ఎట్రాక్ట్ చేసేలా పబ్లిసిటీ క్యాంపైన్  కూడా చేసారు. కాగా..దాంతో ఓ వర్గంలో మంచి ఎక్సపెక్టేషన్స్  మధ్య ఈ రోజు ప్రేక్షకుల ముందుకు ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా విడుదలయ్యింది. అయితే సినిమా అంచనాలకు తగినట్లు లేదు. సెకండాఫ్ సిండ్రోమ్ తో ఈ సినిమా విలవిల్లాడింది. ఎత్తుగడ వరకూ బాగున్న ఈ సినిమా మెల్లిమెల్లిగా పట్టు జారిపోయి భారంగా మారింది.

హాలీవుడ్ చిత్రం హ్యాంగోవర్ ఫార్మెట్ లో నడిచే  ఇలాంటి కథలకు స్క్రీన్ ప్లే, ట్రీట్మెంట్ ప్రాణం. అవెంత గొప్పగా కుదిరితే సినిమా అంత బాగుంటుంది. షార్ట్ ఫిల్మ్ చేయాల్సిన స్టోరీ లైన్ ని సినిమా కథ గా చేసి తెరకెక్కించారనిపించే ఈ చిత్రంలో....  ప్లాట్  మరీ చిన్నది కావటం,సబ్ ప్లాట్స్ లేకపోవటంతో..దాన్ని సెకండాఫ్ దాకా విస్తరించటం కష్టమైపోయింది.   ఫస్టాఫ్ లో కథలో సమస్యను సక్సెస్ ఫుల్ గా సెటప్ చేసినా, ఆ సమస్యలోంచి హీరో ఎలా బయిటపడతాడు అనే కాంప్లిక్ట్  నుంచి వచ్చే సన్నివేశాలు సెకండాఫ్ లో సరిగ్గా ఎగ్జిక్యూట్ చెయ్యలేకపోయారు. పెళ్లాం ఊరిళితే సినిమా కథ తరహాలో హీరో ...ఒక సమస్య నుంచి బయిటపడటానికి చేసే ప్రయత్నంలో మరో సమస్యలో మరింత లోతుగా ఇరుక్కుపోవటంపై దృష్టి పెట్టి ఉంటే ఖచ్చితంగా ఫన్ బాగా పండేది. అలా కాకపోవటంతో సీన్స్ రిపీట్ అయ్యాయి.

 దాంతో క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్ తప్ప పూర్తి ప్లాట్ గా ,ఎక్కడా ఎక్సైటింగ్ గా కానీ, హై ఎమోషన్ కానీ ఫన్ కానీ లేకుండా నడిచింది. పరుగెట్టాల్సిన చోట పాక్కుంటూ వెళ్లింది. ఒకటి రెండు సీన్స్ లో తప్ప ఎక్కడా నవ్వు రాలేదు. సెకండాఫ్ లో వచ్చే ఆ ట్విస్ట్ లు కూడా సరదా లేదు....థ్రిల్ లేదు. ఇదంతా చూస్తూంటే ఫస్టాఫ్ ఒకరు, సెకండాఫ్  వేరే వాళ్లు రాసారేమో అనిపించకమానదు.

తరుణ్ భాస్కర్ ఎలా చేసారంటే...

నటుడుగా తరుణ్ భాస్కర్ కు ఇది తొలి సినిమా కాదు. ఫలక్ నామా దాస్ లోనూ ఓ సపోర్టింగ్ క్యారక్టర్ చేసి శభాష్ అనిపించుకున్నాడు. అయితే సినిమాలో ఓ సపోర్టింగ్ పాత్ర వేయటం వేరు, సినిమా మొత్తాన్ని లీడ్ చేసే హీరో గా చెయ్యటం వేరు. అయితే దర్శకుడు షమీర్ సుల్తాన్ గతంలో తరుణ్ భాస్కర్ దగ్గర పనిచేసాడు కాబట్టి ఆయన లో ప్లస్ లు మైనస్ లు బాగా తెలుసు. వాటిని హైలెట్ చేసుకుంటూ తరుణ్ భాస్కర్ బాడీ లాంగ్వేజ్ కు తగినట్లు గా సీన్స్ డిజైన్ చేసుకుంటూ వెళ్లిపోయాడని అర్దమవుతుంది. ఆ విషయంలో చాలా వరకూ దర్శకుడు, హీరో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. దానికి తోడు తరుణ్ భాస్కర్ మంచి దర్శకుడు కావటం కూడా ప్లస్ అయ్యింది. ఆ కష్టం తెరపై కనపడింది. అయితే విజయ్ దేవరకొండ హీరో అయితే మంచి ఈజ్ తో చేసుకుపోయేవాడు. కానీ తరుణ్ భాస్కర్ ఈజ్ తెచ్చుకోవటానికి కొన్నిసార్లు కష్టపడ్డారని అర్దమవుతుంది.

అనసూయ పాత్ర ఎలా ...

అనసూయ పాత్ర చాలా చిన్నది. ఆమె తన పాత్రను సమర్దవంతంగానే పోషించింది. అయితే సినిమాలో అంతలా క్లిక్ అవ్వలేదు. అంత గుర్తు పెట్టుకునేలాగ లేదు.  

దర్శకుడి తొలి ప్రయత్నం ఎలా ఉంది..

Tharun Bhascker's MEEKU MATHRAME CHEPTHA movie REVIEW

దర్శకుడుగా ఈ చిత్రంతో పరిచయం అయిన షమీర్ సుల్తాన్...అచ్చం తన గురువు తరుణ్ భాస్కర్ ఎలా అయితే సినిమాని డైరక్ట్ చేస్తారో అలాగే చేసారనిపిస్తోంది. నగరానికి ఏమైంది సినిమా స్టైల్ ని పూర్తిగా ఫాలో అయ్యారు. అయితే తన గురువు నుంచి రైటింగ్ స్కిల్స్   ని తీసుకోలేకపోయారు.  దాంతో చాలా చోట్ల ఓ షార్ట్ ఫిలిం ను చూస్తున్న ఫీల్ వచ్చింది. ప్రతీ సీన్ లో కామెడీ ఉండేలా చూసుకున్నాడే కానీ ఓవరాల్ గా కాన్సెప్ట్ నుంచే కామెడీ పిండాలని ప్రయత్నించలేదు. స్క్రీన్ ప్లే పై సరైన కసరత్తు చేయలేదు. ఫస్టాఫ్ లో ఏం జరిగిందో ..సెకండాఫ్ లోనూ అదే రిపీట్ అవుతోందనే విషయం గమనించలేకపోయారు. దాంతో దర్శకుడుగా మేకింగ్ బాగున్నా...కథ,కథనం సపోర్ట్ లేకపోవటంతో విసుగెత్తించింది.
 
 
టెక్నికల్ గా ..

ఈ సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్  మరీ నాశిరకం.   శివ కుమార్ సంగీతం జస్ట్ ఓకే. సినిమాకు పెద్దగా కలిసిరాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగుంది. సినిమాటోగ్రఫీ సోసోగా ఉండటంతో  షార్ట్ ఫిలిం ఫీల్  వచ్చింది.  ఎడిటింగ్ ఓకే.  డైలాగులు చాలా చోట్ల నాచురల్ గా బాగున్నాయి.


ఫైనల్ థాట్...

Tharun Bhascker's MEEKU MATHRAME CHEPTHA movie REVIEW

ఐడియాల దాకా అన్ని సినిమాలు బాగానే ఉంటాయి..అసలు మ్యాటర్ లోకి వచ్చేసరికే తడబడుతూంటాయి.

Rating:2/5

ఎవరెవరు..

న‌టీన‌టులు: తరుణ్ భాస్కర్, అనసూయ భరద్వాజ్, అభినవ్ గౌతమ్‌, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ త‌దిత‌రులు.
ఛాయాగ్రహ‌ణం: మదన్ గుణదేవా
సంగీతం: శివకుమార్
క‌ళ‌: రాజ్కుమార్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: అనురాగ్ పర్వతినేని
నిర్మాతలు: విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ
రచన-దర్శకత్వం: షమ్మీర్ సుల్తాన్

Follow Us:
Download App:
  • android
  • ios