Asianet News TeluguAsianet News Telugu

'భాగ్య‌న‌గ‌ర వీధుల్లో గ‌మ్మ‌త్తు' రివ్యూ!

ఫుల్ లెంగ్త్ కామెడీలో ఈ మధ్యకాలంలో తగ్గాయన్నది మాత్రం నిజం. జంధ్యాల, ఆ తర్వాత వచ్చిన ఇవివి తరహా ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్స్ తీసే దమ్ము దర్శకులలో కనపడటం లేదు

Srinivasa Reddy's Bhagyanagara Veedhullo Gammattu review
Author
Hyderabad, First Published Dec 6, 2019, 1:53 PM IST

---సూర్య ప్రకాష్ జోశ్యుల
ఫుల్ లెంగ్త్ కామెడీలో ఈ మధ్యకాలంలో తగ్గాయన్నది మాత్రం నిజం. జంధ్యాల, ఆ తర్వాత వచ్చిన ఇవివి తరహా ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్స్ తీసే దమ్ము దర్శకులలో కనపడటం లేదు. అయితే కమిడియన్ నుంచి దర్శకుడుగా మారిన శ్రీనివాస రెడ్డి...కామెడీ సినిమా చేస్తున్నారనగానే ఆనాటి సినిమాల తరహాలో తెగ నవ్విస్తాడని అందరూ భావించారు. మరి శ్రీనివాస రెడ్డి వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడా..నవ్వించాడా..లేక నవ్వులు పాలు అయ్యాడా...అసలు గమ్మత్తుగా ఉన్న టైటిల్ కు తగ్గ కథ ఉందా..అదేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథ ఇదే...

షార్ట్ పిలిం డైరక్టర్  శ్రీ‌నివాస్ (శ్రీ‌నివాస‌రెడ్డి)  తన ఫ్రెండ్స్, నటులు అయిన (ష‌క‌ల‌క శంక‌ర్‌, స‌త్య‌) లతో కలిసి షార్ట్ ఫిలిం చేస్తే వర్కవుట్ కాదు. దాంతో తమను తాము ఎలాగైనా ప్రూవ్ చేసుకుని  ఓ షార్ట్ ఫిలిం మేకర్ రఘు బాబు ని కలిస్తే..వీళ్లకి అతనో ఆఫర్ ఇస్తాడు. మంచి హీరోయిన్ ని తెచ్చుకుంటే ఆ టీమ్ తో షార్ట్ ఫిల్మ్ చేస్తానంటాడు.  అదే సమయంలో ఓ లేడీ జర్నలిస్ట్ (డోలిశా ) సిటీలో పెరిగిపోతున్న డ్రగ్ మాఫియా తీగ లాగి డొంక అంతా కదిపి దాన్ని , ఓ వీడియోలో ఆ వివరాలు బంధిస్తుంది. దాంతో ఆ డ్రగ్ బ్యాచ్ మమ్మల్నే ...రోడ్డు మీద పెట్టే ప్రయత్నం చేస్తావా, ఆ వీడియో మాకిచ్చేయ్  అని ఆమె వెంటబడుతూంటారు. ఈ క్రమంలో  ఆమె వచ్చి మన షార్ట్ ఫిలిం బ్యాచ్ కు కలుస్తుంది. మరో ప్రక్క ఆ డ్రగ్ బ్యాచ్ ని నాశనం చేయాలని కంకణం కట్టుకుని తిరుగుతూంటాడు పోలీస్ అధికారి వెన్నెల కిషోర్. అప్పుడు అనుకోకండా శ్రీనివాస రెడ్డి తన ఫ్రెడ్స్ తో కలిసి డ్రగ్స్ తీసుకుంటాడు. ముగ్గరు కుర్రాళ్లు ప్లస్ ఒక అమ్మాయి,డ్రగ్ బ్యాక్, పోలీస్ లు  కలిసి బాగ్యనగర వీధుల్లో ఛేజింగ్ లు చేసేటప్పుడు  ఏం గమ్మత్తులు చేసారు...చివరకు ఏం జరిగింది అనేది తెరపై చూడాల్సిన కథ.
 
  కట్టు తప్పిన కథ, కథనం

కామెడీ సినిమాకు స్క్రీన్ ప్లే ఏమిటీ ...అయినా సెకండాఫ్ బాగుండాలి, అది బాగుంటే హిట్ అని  నమ్మి చేసారేమో ఈ కథ అనిపిస్తుంది. అందుకోసం కావాలని ఫస్టాప్ బోర్ గా నూ..చేసి సెకండాఫ్ లేపే ప్రయత్నం చేసారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్టాఫ్ చాలా బోర్ గా ఉంటుంది. దాంతో సెకండాఫ్ కొద్దిగా బాగున్నా..ఫరవాలేదనిపిస్తుంది. కథకు కావాల్సిన నేపధ్యం, పాత్రలు సెటప్ చేయటమే చాలా సేపు తీసుకోవటంతో, మెదట మలుపు వచ్చేటప్పటికే పుణ్యకాలం గడిచిపోవటంతో  ఫస్టాఫ్ పూర్తిగా భరించలేనిదిగా తయారైంది. ఫస్టాఫ్ తో పోల్చుకుంటే సెకండాఫ్ బెస్ట్.  కానీ టోటల్ గా ...వరస్ట్.

పోగుచేసుకున్న కామెడీ బిట్లు ,సెలబ్రెటీలపై సెటైర్స్ అన్ని కమిడియన్స్ పై ప్లే చేసుకుంటూ వెళ్లిపోయారు. అంతేకానీ ఆ కామెడీని సిట్యువేషన్ తగ్గట్లు వాడితేనే వర్కవుట్ అవుతుందని, అదీ కథలో భాగంగా అయితే బాగుంటుందనే విషయం వదిలేసారు. జబర్దస్త్ సీన్స్ వరసపెట్టి కూర్చి వదిలినట్లు అవుతుంది. దాంతో సినినమా చూస్తున్నామా..లేక ఏదన్నా కామెడీ ఛానెల్ చూస్తున్నామా అనే సందేహం కూడా మనకు వస్తుంది. ఇదే కొత్త రకమైన ప్రయోగం అని దర్శక,నిర్మాతలు భావించి చేస్తే మనం చేసేదేముంది. బిక్కమొహం వేసుకుని చూడటం తప్ప.

డైరక్టర్ గా శ్రీనివాసరెడ్డి ఎలా చేసారంటే...

కథ,ట్రీట్మెంట్ కుదిరితే టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ అక్కర్లేనివి కామెడీ సినిమాలు . అయితే ఆదిలోనే దెబ్బకొట్టినట్లు,కథ విషయంలోనే కృతకంగా ఉండటంతో ఇక దర్శకుడుగా శ్రీనివాసరెడ్డి చేయగలిగిందేమీ కనపడలేదు. డైరక్షన్ విషయంలోనూ అంతగొప్ప మెరుపులూ లేవు.  
 
సీన్ కో కమిడియన్...కమల్ సినిమా స్పూఫ్

 అర్దం పర్దం లేకుండా లేకుండా వెళ్లున్న సినిమాలో ఉన్న సీన్స్ సరిపోవు అన్నట్లు గా... ఎప్పుడో వచ్చిన కమల్ వసంత కోకిల సినిమాకు స్ఫూఫ్ చేయాలని ఆలోచన రావటం విరిక్తి పుట్టిస్తుంది. దానికి తోడు ఫేస్ బుక్ లో పాపులర్ అయిన వాటిని వాడుతూ డైలాగులు. పేరడీలు...అది ఇదీ అని లేని అన్ని వాడేసారు.  ఉన్నంతలో శ్రీనివాసరెడ్డి కన్నా సత్య, షకలక శంకర్ నవ్వించారు. అదీ సెకండాఫ్ లో . బ్రతుకు జట్కా బండి ఎపిసోడ్ కు బ్రతుకు ఎడ్లబండి అంటూ షకలక శంకర్ చేసిన స్పూఫ్ నవ్విస్తుంది.  అలాగే ప్రీ క్లైమాక్స్ లో  సత్య...రసగుల్లా ఎపిసోడ్ తో నవ్విస్తాడు. మిగతావాళ్లంతా సోసో. ముఖ్యంగా హీరోయిన్ అయితే అసలు ఉందా సినిమాలో అనే సందేహం వస్తుంది. వెన్నెల కిషోర్ వంటి సీనియర్ కమిడియన్ సైతం పోలీస్ గా  కామెడీ చేయలేక చతికిలపడ్డాడు. సత్యం రాజేష్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, చిత్రం శ్రీను, వైవా హర్ష, మహేష్ విట్టా వంటి అనేక మంది కమిడియన్స్ ఈ సినిమా నిండా ప్రతీ సీన్ లో కనపడతారు. వీళ్లు నవ్వించేస్తారేమో అనుకునే లోగా వెళ్లిపోతారు.

పాటలు సోసోగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కామెడీ సినిమాకు కలిసొచ్చేది కాదు. కెమెరా వర్క్, ఎడిటింగ్ అన్ని సినిమాకు తగినట్లే సెట్ అయ్యాయి. ఏ విభాగంలోనూ సీరియస్ నెస్ కనపడదు.
 

ఫైనల్ థాట్

నవ్వించటానికి కావాల్సింది కమిడియన్స్ కాదు..కామెడీ సీన్స్ ..సిట్యువేషన్స్

ఎవరెవరు
 
బ్యానర్: ఫ్లయింగ్‌ కలర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
నటీనటులు: శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేశ్‌, వెన్నెల కిషోర్‌, షకలక శంకర్‌, చమక్‌ చంద్ర, సత్య తదితరులు
సంగీతం: సాకేత్‌ కొమందూరి;
సినిమాటోగ్రఫీ: భరణి.కె.ధరన్‌
ఎడిటర్‌: ఆవుల వెంకటేశ్‌;
ఆర్ట్‌: రఘు కులకర్ణి
కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌: పరం సూర్యాన్షు
నిర్మాత, దర్శకత్వం: వై.శ్రీనివాసరెడ్డి;
విడుదల తేదీ: 06-12-2019

Rating: 1.5/5

Follow Us:
Download App:
  • android
  • ios