ప్రముఖ సీనియర్‌ నటుడు, మనిద ఉరిమై కట్చి (మానవ హక్కుల పార్టీ) వ్యవస్థాపకుడు కార్తీక్‌ అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారం ముగించుకుని వచ్చిన ఆయన శనివారం రాత్రి శ్వాస సంబంధించిన సమస్య తలెత్తడంతో ఆసుపత్రికి తరలించారు. చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోగా నటుడు కార్తీక్‌ సుపరిచితుడే. తమిళంలో సినిమాలతో బిజీగా ఉన్న ఆయన ఇటీవల కొత్త పార్టీ పెట్టాడు. మనిద ఉరిమై కట్చి వ్యవస్థాపకుడిగా ఉన్న కార్తీక్‌ అన్నాడీఎంకే–బీజేపీ కూటమికి తన మద్దతును ప్రకటించారు.

ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో తమిళనాటు ప్రచారం ముమ్మరం చేశారు. దీంతో ప్రచారం ముగించుకుని శనివారం రాత్రి ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారు. శ్వాస సమస్య తలెత్తడంతో కుటుంబీకులు చెన్నై అడయార్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కరోనా పరీక్ష నిర్వహించగా నెగటివ్‌ అని తేలింది. ఆయనకు శ్వాససంబంధిత సమస్యలు ఉండడంతో పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. 

ఇదిలా ఉంటే కార్తీక్ తెలుగులో `సీతాకోక చిలుకా`, `అనుబంధం`, `అన్వేషణ`, `పుణ్యస్త్రీ`, `అభినందన`,`మగరాయుడు`, `ఓం 3డీ` చిత్రాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ అలరించారు. ఇప్పుడు ఆయన కుమారుడు గౌతమ్‌ కార్తీక్‌ కూడా నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు.