రాజకీయాల్లోకి వస్తానని అభిమానులను ఊరించి చివరికి నిరాశ పర్చిన సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రిపబ్లిక్‌ డే సందర్భంగా గుడ్‌ న్యూస్‌ చెప్పారు. తాను నటిస్తున్న సినిమా అప్‌డేట్‌ ప్రకటించారు. ప్రస్తుతం ఆయన `అన్నాత్తే` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. శివ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. సన్‌ పిక్చర్స్ నిర్మిస్తుంది. కళానిధి మారన్‌ నిర్మాత. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తిసురేష్‌, నయనతార, ఖుష్బు, మీనా కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. నవంబర్‌ 4న దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్టు తెలిపింది యూనిట్‌. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల కరోనా కారణంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతున్న సమయంలో చిత్ర బృందంలో కొంత మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో వెంటనే షూటింగ్‌ని నిలిపివేశారు. ఆ వెంటనే రజనీ అనారోగ్యానికి గురయ్యారు. బీపీ పెరగడంతో రెండు రోజుల పాటు ఆందోళన నెలకొంది. 

ఈ ఉత్కంఠభరిత సంఘటన అనంతరం ఆసుపత్రి నుంచి ఇంటికెళ్లిన రజనీ తాను రాజకీయాల్లోకి రావాలనుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు, ఇక తాను రాజకీయాల్లోకి రాలేనని ప్రకటించారు. నటుడిగానే సేవ చేస్తానని చెప్పారు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా తన సినిమా నుంచి గుడ్‌ చెప్పి ఊరటనిచ్చారు. ఇదిలా ఉంటే దీపావళికి రజనీ సినిమా వచ్చి 26ఏళ్లు అవుతుందట. `ముత్తు` సినిమా తర్వాత ఈ సారి వస్తున్నారు.