పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఇటీవలే `వకీల్‌ సాబ్‌` షూటింగ్‌ని పూర్తి చేసుకున్నారు. ఆ మధ్యనే `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌ని ప్రారంభించారు. సాగర్‌ కె చంద్ర దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి స్క్రీన్‌ప్లే, డైలాగులు త్రివిక్రమ్‌ అందిస్తున్నారు. ఇందులో రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ సోమవారం నుంచి ప్రారంభించారు. 

ఇందులో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొంటుండగా, ఆయనపై యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు దర్శకుడు సాగర్‌ కె చంద్ర. ఇందులో రానా దగ్గుబాటి కూడా పాల్గొంటున్నారు. పది రోజలపాటు హైదరాబాద్‌లో ఈ చిత్ర షూటింగ్‌ జరుపనున్నట్టు నిర్మాత నాగవంశీ తెలిపారు. ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుందని చెప్పారు. ఇదిలా ఉంటే ఇందులో ఐశ్వర్యా రాజేష్‌, సాయిపల్లవిలను హీరోయిన్లుగా అనుకుంటున్నట్టు టాక్‌.

ప్రముఖ నటులుసముద్ర ఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను ఈ చిత్రానికి ఇప్పటివరకు ఎంపికైన తారాగణం కాగా ఈ చిత్రానికి ఎస్‌ఎస్‌ థమన్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ళ కెమెరామెన్‌గా, నవీన్‌ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఏ.ఎస్‌. ప్రకాష్‌ ఆర్ట్ డైరెక్టర్‌.   ఈ చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు త్వరలో తెలియజేస్తామని యూనిట్‌ చెప్పింది. ఈ చిత్రానికి సమర్పకులు గా పి.డి.వి. ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల క్రిష్‌ చిత్రం కూడా ప్రారంభమైంది. ఏక కాలంలో క్రిష్‌ సినిమా షూటింగ్‌లో, అలాగే సాగర్‌ చంద్ర చిత్రంలో పవన్‌ పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది.