ఇదే కథ...

డబ్బై ఏళ్ల సావిత్రి అలియాస్ బేబి (లక్ష్మీ)  తన యుక్త వయసులోనే భర్తను కోల్పోయి, ఒంటి చేత్తో కుటుంబాన్ని లాక్కొచ్చి పిల్లలను పెంచుకొస్తుంది. దాంతో ఓ రకమైన మనస్తత్వానికి అలవాటు పడుతుంది. ఆమె తన ప్రెండ్ చంటి( రాజేంద్రప్రసాద్)  తో కలిసి  ఓ క్యాంటీన్ నడుపుతూంటుంది.  ఆ కాలేజీలోనే  ఆమె కొడుకు రావు రమేష్ లెక్చరర్ గా పనిచేస్తూంటాడు.  బేబీ(లక్ష్మి)పాతకాలపు ఛాదస్తం,  అతి ప్రేమతో అందరినీ విసిగిస్తూంటుంది. దాంతో కోడలు (ప్రగతి)అనారోగ్యం చేయటంతో ఆమెను ఒక వృద్ధాశ్రమంలో విడిచిపెట్టేస్తారు. దాంతో బాధ పడిన ఆమె తన యవ్వనం తిరిగి వస్తే బాగుండు, ఆ రోజులే బంగారం  అనుకుంటుంది. ఆమె కోరికను భగవంతుడు తీరుస్తాడు.  అనుకోకుండా జరిగిన  ఓ చిన్న  మ్యాజిక్ తో ఆమె యంగ్ అండ్ బ్యూటిఫుల్ బేబి(సమంత)గా మారిపోతుంది.

 ఫుల్ ఎనర్జీగా తయారైన బేబి  తన యుక్త వయసులో కోల్పోయిన కలలన్నిటిని నిజం చేసుకునే కార్యక్రమం మొదలెడుతుంది. ముసలి మామ్మ ఇలా యంగ్ బేబిగా మారిందని ఊహించని ఆ ఇంట్లో వాళ్లు  ఆమె కళ్ల ఎదురుగా తిరుగుతున్నా తెలుసుకోలేక, ఎక్కడికో వెళ్లిపోయిందనుకుంటారు. బేబి కూడా తాను ఫలానా అని చెప్పదు.  బేబి తన ఇంటిప్రక్కనే ఉన్న ప్రెండ్  చంటి ఇంట్లో అద్దెకు దిగుతుంది.  అప్పుడు ఏం జరిగింది. యంగ్ బేబిగా మారాక ఆమె చేసిన పనులేంటి...అసలు ఆమె అసలు అలా ఎలా మారింది? ఈ కథలో నాగశౌర్య పాత్ర ఏమిటి... చివరకు బేబి అలాగే యంగ్ గా ఉండిపోయిందా? తిరిగి యధా స్దితికి తన డబ్బే సంవత్సరాల వయస్సుకు వెళ్లిపోయిందా  వంటి విషయాలు తెలియాలంటే  ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
   
రీమేక్ చేయటం అంత ఈజీ కాదు

రీమేక్ చేయటం అంటే ముందు దాన్ని మన నేటివిటికి తీసుకువచ్చేలా లొంగతీసుకోవటం...అందులోనూ హిట్ సబ్జెక్ట్ ని మార్చటం అంటే పొగరుబోతు గుర్రాన్ని లొంగతీసుకోవటమే. ఎక్కడ ఏం మార్చినా..ఎదురుతిరుగుతుంది. అసలు ఎందుకు హిట్ అయ్యిందో చూసుకుని,ఆ ఎలిమెంట్స్ ని మన నేటివిటీలోకి తీసుకువచ్చి..ఇక్కడ భావోద్వేగాతో కలిపి  వండగలగాలి. అదీ ఏ తమిళ లేదా మళయాళ రీమేక్ అయితే దాదాపు అక్కడ , ఇక్కడ ఒకే రకమైన పరిస్దితులు ఉంటాయి కాబట్టి పెద్దగా మార్చాల్సిన పని ఉండదు. కానీ ఇది కొరియా రీమేక్..వాళ్ళ జీవిన విధానం వేరు..వారి నాగరికత వేరు..వాటిని దృష్టిలో పెట్టుకుని చేయాల్సిన మార్పులు చేసి మన జీవితాలకు దగ్గరకు తీసుకువచ్చిన ఘనత మాత్రం రైటింగ్ డిపార్టమెంట్ దే. 

స్టార్ కాదు నటి

ఈ సినిమాలో మనకు సమంత ఓ స్టార్ హీరోయిన్ గా కనపడదు. ఓ నటిలా కనిపించి మనను ఆశ్చర్యపరుస్తుంది. సినిమాని ఒంటిచేత్తో లాక్కెళ్లిపోతూంటే మనం అలా ముగ్దులమై చూస్తూంటాం. ఫన్ , ఎమోషన్ కలగలిపిన హైపర్ యాక్టవ్ క్యారక్టర్ లోకి దూరిపోయి దుమ్మురేపుతుంది.  రాజేంద్రప్రసాద్ ఈ సినిమాకు మరో ఫిల్లర్. ఆయన లేకుండా ఈ సినిమా ని ఊహించలేం. ఆయన ఎక్సప్రెషన్స్ మనకు అలవాటైనవే అయినా  బాగా నచ్చుతాయి. సీనియర్ నటి లక్ష్మీ గురించి కొత్తగా చెప్పకునేదేముంది. మంచి ఫెరఫార్మెన్స్ తో సీన్స్ ని అలవోకగాలాక్కెళ్లిపోయింది.  క్లైమాక్స్ లో రావు రమేష్, సమంత మధ్య వచ్చే ఎమోషన్స్ సీన్స్ బాగా పండాయి.  అడవి శేషు,జగపతిబాబు వి పెద్ద క్యారక్టర్స్ కావు.

అంతా బాగానే ఉంది కానీ..

సినిమా ఫస్టాఫ్ ఎంత ఫన్ తో నడిచినా,సెకండాఫ్ కు వచ్చేసరికి కథలో  ప్రొసీడింగ్స్ ఎక్కువై స్లో అయ్యిపోయింది. లెంగ్త్ కాస్త తగ్గించి ట్రిమ్ చేస్తే బాగుండును అనిపిస్తుంది. దానికి తోడు పూర్తి ప్రెడిక్టుబుల్ గా నడిచే సీన్స్ మనకు కొత్తగా అనిపించవు. ఊహించిందే తెరపై జరుగుతూండటం కొన్ని సార్లు ఇబ్బందే. 

నందినీ రెడ్డి ఎలా చేసారంటే..
అలా మొదలైంది చిత్రంతో తెలుగు తెరపై తన ముద్రవేసిన నందినీరెడ్డి ఈ సినిమాతో పూర్తి ఫామ్ లోకి వచ్చారనే చెప్పాలి. కామెడీని ఆమె హ్యాండిల్ చేసే విధానం, రైటింగ్ మంచి స్టాండర్డ్స్ లో ఉన్నాయి. ఇలాంటి కథలో ఎక్కడా హై పాయింట్స్  లేవు. కానీ తన ప్రతిభతో ఎక్కడా గ్రిప్ పోకుండా స్టడీగా గ్రాఫ్ ని నిలబెట్టింది.   సినిమాలో రకరకాల పాత్రలను మొదట నీట్ గా ఎస్టాబ్లిష్ చేసి కథలోకి వెళ్లటమే ఆమె స్క్రీన్ ప్లే పరంగా చేసిన బెస్ట్ థింగ్.  అయితే లవ్ స్టార్, మ్యూజికల్ కంటెస్ట్ ట్రాక్ లు కథలో కలవలేదనిపిస్తుంది. 

మ్యూజిక్  మిగతా డిపార్టమెంట్ లు? 
ఈ సినిమాకు మిక్కీజే మేయర్ ఇచ్చిన సంగీతం  అంతగొప్పగా లేదు. బ్యాక్ గ్రౌండ్ స్క్రోర్ అద్బుతం కాదు కానీ ఓకే. సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుండి..ఓ గ్లాసీ లుక్ ని సినిమాకు తెచ్చి పెట్టింది. ఎడిటింగ్ విషయానికి సెకండాఫ్ మరింత ట్రిమ్ చేయాలనిపిస్తుంది. డైలాగులు బాగున్నాయి. సీన్  కు తగినట్లుగా ఫెరఫెక్ట్ గా పడ్డ పదాలతో హాయిగా అనిపించాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సూపర్.

ఫైనల్ థాట్
సోలోగా హీరోయిన్స్ తో దెయ్యాల సినిమాలే కాదు..కామెడీ సినిమాలు కూడా ట్రై చేయచ్చు అని ప్రూవ్ చేసిందీ బేబి.

రేటింగ్:3/5

ఎవరెవరు

నటీనటులు : సమంత,  ల‌క్ష్మి, రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ప్ర‌గ‌తి  రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, ప్ర‌గ‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.  మ్యూజిక్‌:  మిక్కి జె.మేయ‌ర్‌,
కెమెరా:  రిచ‌ర్డ్ ప్ర‌సాద్ , 
డైలాగ్స్‌: ల‌క్ష్మీ భూపాల్‌, 
ఎడిట‌ర్‌:  జునైద్ సిద్ధిఖీ, 
ప్రొడ‌క్ష‌న్ , డిజైన్‌:జ‌య‌శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌,
 నిర్మాత‌లు:  సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, హ్యువు థామ‌స్ కిమ్ ,
ఆర్ట్‌:  విఠ‌ల్‌.కె, 
ద‌ర్శ‌క‌త్వం:  బి.వి.నందినీ రెడ్డి, 
నిర్మాణ సంస్థ‌లు:  సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిలింస్‌, క్రాస్ పిక్చ‌ర్స్‌,
 స‌హ నిర్మాత‌లు:  విజ‌య్ దొంకాడ‌, దివ్యా విజ‌య్‌.