ప్రభాస్‌ హోం క్వారంటైన్‌ అయ్యారు. ఆయన మేకప్‌ మేన్‌కి కరోనా సోకడంతో `రాధేశ్యామ్‌` స్టార్‌ స్వీయ నిర్భందంలోకి వెళ్లిపోయారు. `రాధేశ్యామ్‌` చిత్రీకరణలో భాగంగా యూనిట్‌కి కరోనా సోకింది. అందులో ప్రభాస్‌ పర్సనల్‌ మేకప్‌మేన్‌ కూడా ఉన్నారు. దీంతో సినిమా షూటింగ్‌ని తాత్కాలికంగా నిలిపివేశారు. చిత్ర బృందంతోపాటు ప్రభాస్‌ కూడా హోం ఐసోలేషన్‌ అయినట్టు తెలుస్తుంది. కరోనా తీవ్రత తగ్గిన తర్వాతనే షూటింగ్‌కి వెళ్లాలని నిర్ణయించుకుంటున్నట్టు తెలుస్తుంది. అప్పటి వరకు షూటింగ్‌ ఆపేయాలని భావిస్తున్నారట. 

ఇదిలా ఉంటే రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌. ఈ సినిమా దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కొన్ని సన్నివేశాలను రీషూట్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతోపాటు కొంత ప్యాచ్‌ వర్క్ ఉందట. వీటిని కంప్లీట్‌ చేసుకుని పూర్తి స్థాయిలో `సలార్‌`, `ఆదిపురుష్‌`లపై ఫోకస్‌ పెట్టాలని భావించారు ప్రభాస్‌. కానీ ఇప్పుడు కరోనా వెంటాడటంతో ఈ ప్రభావం మిగిలిన రెండు సినిమాలపై కూడా పడింది. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు కూడా ఆగిపోనున్నాయి. ఇదిలా ఉంటే `రాధేశ్యామ్‌` చిత్రాన్ని జులై 30న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు వంశీ, ప్రమోద్‌ ప్రసీద. పాన్‌ ఇండియా చిత్రంగా ఇది విడుదల కాబోతుంది. 

మరోవైపు `కేజీఎఫ్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌తో `సలార్‌` చిత్రం చేస్తున్నారు ప్రభాస్‌. ఇందులో శృతి హాసన్‌ హీరోయిన్‌. హోంబలే ఫిల్మ్ నిర్మిస్తుంది. దీంతోపాటు రామాయణం ఆధారంగా `ఆదిపురుష్‌`ని హిందీ దర్శకుడు ఓం రౌత్‌ రూపొందిస్తున్నారు. ఇందులో సీతగా కృతి సనన్‌, రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నారు. ఈ రెండు సినిమా షూటింగ్‌ల్లో ప్రభాస్‌ ఏకకాలంలో పాల్గొనబోతున్నారు.