ఆంటోనీ వర్గీస్ పెప్పె, దుషారా విజయన్, సునీల్, కబీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ `కాటాలన్‌`. డెబ్యూ డైరెక్టర్ పాల్ జార్జ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. రవి బస్సూర్‌ సంగీతం అందించిన ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం. 

`కాటాలన్‌` మూవీ రివ్యూ

'మలయాళం సినిమాలో మోస్ట్ వయొలెంట్ మూవీ' అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా ప్రచారంలోకి వచ్చింది. పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ హిట్టయిన 'మార్కో' తర్వాత క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన సినిమా కావడంతో 'కాటాలన్‌'పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మాస్, యాక్షన్‌తో థియేటర్లలో అదిరిపోయే అనుభూతిని ఇవ్వడానికి రవి బస్సూర్‌ మ్యూజిక్ కూడా తోడైంది. ఆంటోనీ వర్గీస్ పెప్పె, దుషారా విజయన్, సునీల్, కబీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. డెబ్యూ డైరెక్టర్ పాల్ జార్జ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. మలయాళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులోనూ విడుదలైంది. మరి గురువారం(మే 28)న రిలీజ్‌ అయిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

`కాటాలన్‌` మూవీ స్టోరీ ఇదే 

అడవి, ఏనుగు దంతాల వేట.. ఇదే ఈ సినిమా కథా నేపథ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే, అడవి దొంగల మధ్య అధికారం కోసం, పగ తీర్చుకోవడం కోసం జరిగే పోరాటమే `కట్టలాన్‌` మూవీ. ఈ కథ మొత్తం 'ఆనకొల్లి' అనే ఒక ఊహాజనిత గ్రామంలో జరుగుతుంది. ఏనుగులను చంపి, వాటి దంతాలను స్మగ్లింగ్ చేసే ఈ గ్రామాన్ని సునీల్ పోషించిన మారి అనే పాత్ర తన గ్యాంగ్‌తో కంట్రోల్ చేస్తుంటాడు. కబీర్ దుహాన్ సింగ్ పోషించిన ఎడ్డీ అనే పాత్ర ఆ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. సరిగ్గా అప్పుడే ఆంటోనీ వర్గీస్ పోషించిన ఆంటోనీ పాత్ర వీరి మధ్యలోకి వస్తుంది. అక్కడి నుంచి `కట్టలాన్‌' ప్రపంచం మరింత పెద్దదిగా మారుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరం. 

`కాటాలన్‌` మూవీ విశ్లేషణ

ఒక పక్కా మాస్ మసాలా యాక్షన్ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలూ ఇందులో ఉన్నాయి. మంచి, చెడు అని కాకుండా.. హీరో, విలన్ అని తేడా లేకుండా గ్రే షేడ్ పాత్రలు ఆకట్టుకుంటాయి. ఏనుగు దంతాల స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి డబ్బు, అధికారం కోసం వీళ్లు చేసే పోరాటాలు మామూలుగా ఉండవు. ఈ క్రమంలో కొందరు అమాయకులు బలైపోతుంటారు. జగదీష్ పాత్ర అయిన అలీ వాయిస్‌ ఓవర్‌తో కథ, దాని పరిసరాలు ప్రేక్షకులకు అర్థమవుతాయి. ఆంటోనీకి తోడుగా అలీ పాత్ర ఉంటుంది. ఒక సాధారణ వ్యక్తి నుంచి నాయకుడిగా ఆంటోనీ ఎలా ఎదిగాడన్నది పెప్పె తన నటనతో అద్భుతంగా చూపించాడు. అణచివేతకు గురైన కార్మికులకు నాయకత్వం వహించి, ఆ స్మగ్లింగ్ సామ్రాజ్యానికి అధిపతిగా ఎదుగుతాడు. సినిమా సెకండాఫ్‌లో దుషారా విజయన్ ఎంట్రీ ఇస్తుంది. హనాన్ షా, హిప్‌స్టర్, అల్ఫోన్స్ పుత్రేన్, సిద్ధిఖ్, ఆన్సన్ పాల్, షోన్ జాయ్ వంటి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు. థియేటర్లో చప్పట్లు కొట్టించే ఒక క్యామియో కూడా ఉంది. మామూలుగా మనం చూసే మాస్-గ్యాంగ్‌స్టర్ సినిమాల ఫార్ములాలోనే 'కట్టలాన్‌' కూడా ఉంటుంది. కానీ, స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సులు ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. తన బలం అయిన యాక్షన్ సన్నివేశాల్లో పెప్పె ఎప్పటిలాగే ఇరగదీశాడు. ఈ మూవీ ఆడియెన్స్ కి ఒక యాక్షన్‌ ట్రీట్ ఇచ్చిందని చెప్పొచ్చు. 

టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

కొత్త దర్శకుడు పాల్ జార్జ్‌కు సినిమా టెక్నికల్ టీం పెద్ద బలంగా నిలిచింది. ప్రొడక్షన్ క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా, థియేటర్లలో ఒక మంచి అనుభూతిని అందించారు. 'KGF' లాంటి పాన్-ఇండియా సినిమాలకు తన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఊపు తెచ్చిన రవి బసూర్‌, 'మార్కో' తర్వాత మళ్లీ మలయాళంలో సత్తా చాటాడు. రిపీట్‌గా కాకుండా, ప్రతి పాత్రకు ప్రత్యేకమైన, కొత్త నేపథ్య సంగీతాన్ని అందించాడు. యాక్షన్ సంతోష్-కెచ్చా ఖంఫాక్డీ టీం కంపోజ్ చేసిన యాక్షన్ సీన్లు సినిమాకు మరో హైలైట్. రణదివె-చంద్రు సెల్వరాజ్-సుదీప్ ఎలమన్ సినిమాటోగ్రఫీ, షమీర్ మహమ్మద్ ఎడిటింగ్ కలిసి ఒక విజువల్ ట్రీట్‌ను అందించాయి. అడవి నేపథ్యంలో అడవి మనుషుల కథ చెప్పిన ఈ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన చిత్రం అని చెప్పొచ్చు.