- Home
- Entertainment
- Movie Reviews
- Trikala Movie Review: త్రికాల మూవీ రివ్యూ.. సరికొత్త మైథాలజీ డార్క్ ఫాంటసీ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Trikala Movie Review: త్రికాల మూవీ రివ్యూ.. సరికొత్త మైథాలజీ డార్క్ ఫాంటసీ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Trikala Movie Review: ప్రస్తుతం ఫాంటసీ చిత్రాలు, మైథాలజీ చిత్రాల జోరు నడుస్తోంది. ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. అదే కోవలో ఇప్పుడు `త్రికాల` మూవీ వచ్చింది. ఈ గురువారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే?

త్రికాల మూవీ రివ్యూ
ప్రస్తుతం ఫ్యామిలీ డ్రామాల కంటే యాక్షన్, మైథాలజీ మూవీస్ ఎక్కువగా ఆడుతున్నాయి. అలాంటి వాటికే ఆడియెన్స్ ప్రయారిటీ ఇస్తున్నారు. చూసేందుకు ఇష్టపడుతున్నారు. లార్జర్ దెన్ లైఫ్ మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే చాలా సినిమాలు ఈ జోనర్ లో వస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు `త్రికాల` అనే వచ్చింది. కొత్త తరహా మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకి `ఎ స్క్రిప్ట్ ఆఫ్ గాడ్` అనేది సబ్‌టైటిల్. దర్శకుడు మణి తెల్లగూటి తెరకెక్కించిన ఈ సినిమా కర్మ సిద్ధాంతం, పునర్జన్మ, తాంత్రిక శక్తులు, మానసిక భయం, మానవ భావోద్వేగాలను ఒకే కథలో మిళితం చేసిన విజువల్ వండర్ గా ఉందని టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో అజయ్, అర్జున్ అంబటి, శ్రద్ధా దాస్, మాస్టర్ మహేంద్రన్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. చాగంటి ప్రొడక్షన్ ‘త్రికాల’ సినిమాను వరల్డ్ వైడ్‌గా థియేటర్‌లలో విడుదల చేసింది. గురువారం (మే 28)న విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.
త్రికాల మూవీ స్టోరీ
కొన్ని శతాబ్దాల క్రితం కుమారి ఖండం అనే ఒక పౌరాణిక భూభాగంలో ఈ కథ ప్రారంభమవుతుంది. అక్కడి మునులు అత్యంత శక్తివంతమైన తాంత్రిక గ్రంథాలు, ప్రాచీన సాంకేతిక రహస్యాలను అసురుల చేతికి చిక్కకుండా రహస్య ప్రదేశంలో దాచిపెడతారు. ఆ సీక్రెట్స్‌ను కాపాడేందుకు `శక్తి యోథా` అనే దైవిక ఆయుధాన్ని సృష్టించి, దానిని వీరరాజు త్రికాల వర్మకు అప్పగిస్తారు. అసుర శక్తులపై పోరాడుతూ అతడు మరణించగా, మునులు అతని ఆత్మను ఒక మాయా అండంలో బంధిస్తారు. కలియుగంలో ప్రపంచానికి భారీ ముప్పు వచ్చినప్పుడు ఆ ఆత్మ మళ్లీ మేల్కొంటుందని వారు చెబుతారు.
ప్రస్తుతం శివ (మాస్టర్ మహేంద్రన్) అనే యువకుడు అదృశ్యమైన తన ప్రేయసి నిధి (సాహితి) కోసం నగరానికి వస్తాడు. అతని దగ్గర ఒక దుష్టశక్తి ఆవహించిన ఫోన్ ఉంటుంది. ఈ క్రమంలో అతనికి వైతరణ్ (అజయ్) అనే విచిత్రమైన వ్యక్తి గురించి తెలుస్తుంది. సూర్యరశ్మిని తట్టుకోలేని ‘పోర్ఫిరియా’ వ్యాధితో బాధపడుతున్న వైతరణ్, నిజానికి పునర్జన్మ ఎత్తిన త్రికాలవర్మ. కుటుంబ సంఘర్షణలు, మానసిక వేదనలతో అతను తన తండ్రిని, పినతల్లి (ఆమని)ని హత్య చేసి ఆత్మహత్య చేసుకుంటాడు. కానీ అతని ఆత్మ ఒక భయానక బంగ్లాలోనే సంచరిస్తూ ఉంటుంది. సైకియాట్రిస్ట్ మాయ (శ్రద్ధా దాస్) ఆ ఇంట్లో చిక్కుకుపోతుంది. మరోవైపు అసుర రాజు తిరిగి భూమిపై ఆధిపత్యం సాధించేందుకు మేల్కొంటాడు. అప్పుడు దర్వాడి తాంత్రిక తెగ ఆ మాయా అండాన్ని యాక్టివేట్ చేసి, త్రికాలవర్మ ఆత్మను తిరిగి ఎలా మేల్కొలిపింది? శివకు ఈ కథతో ఉన్న అసలు సంబంధం ఏమిటి? చివరకు అసుర శక్తులపై విజయం సాధించారా? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ.
త్రికాల మూవీ ఎలా ఉందంటే?
`త్రికాల`లో కథ కొత్తగా, బలంగా ఉంది. కర్మ సిద్ధాంతాన్ని కేవలం డైలాగ్స్ రూపంలో కాకుండా, పాత్రల మానసిక స్థితి, వారి గతం, పునర్జన్మల ద్వారా చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. పౌరాణికతను ఆధునిక ప్రపంచంతో మిళితం చేయడం సినిమాలో ప్రధాన బలం. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు టెక్నికల్ ఫిల్మ్ మేకర్గా దర్శకుడు మణి తెల్లగూటి పేరు వినిపించడం యాదృచ్ఛికం కాదు. ఆయన దర్శకత్వం ఈ సినిమాలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణ దర్శకులు షూటింగ్ తర్వాత VFX గురించి ఆలోచిస్తే, మణి మాత్రం కథ రాసే దశ నుంచే ప్రతి ఫ్రేమ్‌ను విజువల్‌గా డిజైన్ చేసినట్లు ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ‘త్రికాల’లో ప్రతి షాట్‌కు ఒక ప్రత్యేకమైన డార్క్ విజువల్ లాంగ్వేజ్ ఉంది. మైథాలజీ, తాంత్రిక శక్తులు, సైకాలజికల్ హారర్ అంశాలను ఒకే ప్రపంచంగా చూపించేందుకు ఆయన ఎంచుకున్న ఫ్రేమింగ్ స్టైల్ ప్రత్యేకంగా నిలుస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించే నీడలు, ఖాళీ కారిడార్లు, మసక వెలుతురు, నెమ్మదిగా కదిలే కెమెరా కూడా సినిమాపై ఉత్కంఠత, ఆసక్తి పెంచుతూ ఉంటుంది. దర్శకుడి విజన్ వల్లే ఈ సినిమా ఒక డార్క్ మిస్టిక్ యూనివర్స్ లా అనిపిస్తుంది. అదే సమయంలో చివర్లో అవెంజర్స్ ని తలపిస్తుంది.
‘త్రికాల’ రొటీన్ హారర్ సినిమా కాదు. ఇది మైథాలజీ, సైకాలజికల్ హారర్, డార్క్ ఫాంటసీ, విజువల్ థ్రిల్లర్‌ల మేళవింపు. స్టోరీ, విజువల్స్, బీజీఎం ఇవన్నీ కలిపి సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. పౌరాణిక రహస్యాలు, కర్మ సిద్ధాంతం, డార్క్ ఫాంటసీ, హాలీవుడ్ స్థాయి విజువల్స్ కలయికగా ‘త్రికాల’ను చెప్పుకోవచ్చు. విజువల్ పరంగా, బీజీఎం పరంగా సినిమా వేరే లెవల్‌లో ఉంటుంది. ఏఐని వాడి ఫాంటసీ ఎలిమెంట్లని చూపించిన తీరు బాగుంది. సినిమా గ్రాండియర్ ఫీలింగ్‌ని కలిగిస్తాయి. అయితే స్క్రీన్ ప్లే పరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. మరింత అర్థవంతంగా తెరకెక్కించాల్సింది. కామన్ ఆడియెన్స్ కి కూడా అర్థమయ్యేలా చెప్పడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. మధ్యలో కొన్ని సీన్లు ల్యాగ్ అనిపిస్తాయి. ఏం చెబుతున్నారో, కథ ఎటువైపు వెళ్తుందనే క్లారిటీ మిస్ అయ్యింది. కొంత డైవర్ట్ ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ ని మరింత బాగా డిజైన్ చేయాల్సింది. ఇలాంటి కొన్ని మైనస్‌లు పక్కన పెడితే మంచి మైథాలజీ, విజువల్స్ ట్రీట్, ఫాంటసీ చిత్రాలను ఇష్టపడేవారికి బాగా నచ్చే మూవీ అవుతుంది.
త్రికాల మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా నటించారంటే?
వైతరణ్ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణ. సూర్యకాంతిని తట్టుకోలేని ఒక మనిషి, మానసిక ఒత్తిడి, అంతర్మథనం, భయం, దుష్టశక్తి మధ్య చిక్కుకున్న పాత్రగా అజయ్ అద్భుతంగా కనిపించాడు. అతని కోసం ప్రత్యేకంగా రూపొందించిన మాస్క్‌లు, కాస్ట్యూమ్స్, డార్క్ విజువల్ ట్రీట్‌మెంట్ చాలా కొత్తగా ఉన్నాయి. హీరో మాస్టర్ మహేంద్రన్ ఈ సినిమాలో చాలా నేచురల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అమాయకత్వం, ప్రేమ, భయం, భావోద్వేగం.. ఇలా విభిన్నమైన ఎమోషన్స్‌ను చాలా ఈజ్‌తో చూపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ వైపు వచ్చే భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటన బాగా కనెక్ట్ అవుతుంది. శ్రద్ధా దాస్ ఈ సినిమాకు మరో హైలైట్. చాలా రోజుల తర్వాత మంచి పాత్రలో మెరిసింది. తన పాత్రలో గ్లామర్ కంటే మిస్టరీ ఎక్కువగా కనిపిస్తుంది. సైకియాట్రిస్ట్ పాత్రలో చాలా కంట్రోల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సీనియర్ నటి ఆమని పాత్ర కూడా సినిమాకు కీలకం. తల్లితనంతో పాటు భయం, బాధ, అనుమానం వంటి భావోద్వేగాలను చాలా సహజంగా చూపించింది. ఆమె పాత్ర కథలో ఎమోషనల్ వెయిట్‌ను పెంచుతుంది. అర్జున్ అంబటి కూడా నెగటివ్ రోల్‌లో బాగా చేశాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.
త్రికాల మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?
సినిమా టెక్నీకల్‌గా అదిరిపోయింది. సినిమాటోగ్రాఫర్లలో పవన్ చెన్నా కెమెరా కేవలం పాత్రలనే కాదు, ప్రతి ఫ్రేమ్ ద్వారా భావోద్వేగాన్ని పలికిస్తుంది. విజువల్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. పౌరాణిక ప్రపంచం, చీకటి బంగ్లాలు, తాంత్రిక శక్తులు, ఆధ్యాత్మిక యుద్ధాలను చూపించేందుకు ఆయన వాడిన లైటింగ్ స్టైల్ అద్భుతంగా ఉంది. డార్క్ ఇంక్-బ్లాక్ టోన్స్ మధ్య గోల్డెన్ లైట్ బీమ్స్ ఉపయోగించడం వల్ల సినిమాలో ఒక మిస్టిక్ ఫీల్ వచ్చింది. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్‌లా కనిపించేలా కంపోజ్ చేయడం సినిమాకు హాలీవుడ్ స్థాయి విజువల్ ఫీల్ తీసుకొచ్చింది. ముఖ్యంగా హారర్ సీన్స్‌లో కెమెరా మూమెంట్స్ చాలా స్లోగా, అన్‌కంఫర్టబుల్ ఫీలింగ్ వచ్చేలా డిజైన్ చేయడం వల్ల ప్రేక్షకుడు కూడా ఆ భయాన్ని అనుభూతి చెందుతాడు. ఎడిటింగ్ విషయంలో కూడా మణి పని చాలా భిన్నంగా ఉంది. సాధారణ కమర్షియల్ కట్‌లకు బదులుగా, సౌండ్ డిజైన్, విజువల్ రిథమ్‌కు ప్రాధాన్యం ఇచ్చే సినిమాటిక్ కటింగ్ విధానం వాడినట్లు తెలుస్తోంది. అందుకే ట్రైలర్‌లోని ప్రతి షాట్ థియేటర్లలో ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. హర్షవర్ధన్ రామేశ్వరం అందించిన మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలం. దాంతో పాటు షాజిత్ హుమయూన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసింది. ముఖ్యంగా హారర్, తాంత్రిక సీన్లలో బీజీఎం భయాన్ని మరింత పెంచింది. కొన్ని సీన్లలో మ్యూజిక్ కంటే సౌండ్ డిజైన్‌నే ఎక్కువగా ఉపయోగించడం మరింతా ఎఫెక్టివ్‌గా అనిపిస్తుంది.
త్రికాల మూవీ వీఎఫ్‌ఎక్స్ పరంగా
ఇక సినిమాలో భారీ సెట్లు లేకపోయినా, ఫ్రేమ్ కంపోజిషన్, డిజిటల్ ఎక్స్‌టెన్షన్స్, సీజీఐ బ్యాక్‌డ్రాప్స్ ద్వారా గ్రాండ్ విజువల్ స్కేల్ తీసుకురావడం దర్శకుడి ప్రధాన బలం. చాలా సన్నివేశాల్లో హాలీవుడ్ డార్క్ ఫాంటసీ తరహా విజువల్ టోన్ కనిపిస్తుంది. ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్ చాలా కీలక పాత్ర పోషించింది. మాయా అండం, అసుర శక్తులు, ఆధ్యాత్మిక యుద్ధాలు, ప్రాచీన ప్రపంచాల డిజైన్.. ఇలా విజువలన్నీ రిచ్‌గా కనిపిస్తాయి. నిర్మాత రాధికా శ్రీనివాస్ ఈ సినిమాను చాలా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మించారు. స్క్రీన్‌పై ప్రతి ఫ్రేమ్‌లోనూ క్వాలిటీ కనిపించేలా ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించిన తీరు స్పష్టంగా తెలుస్తోంది.
ఫైనల్‌గా
పౌరాణిక రహస్యాలు, ఆధ్యాత్మిక కాన్సెప్ట్స్, హాలీవుడ్ తరహా డార్క్ విజువల్ అనుభూతిని ఇష్టపడే ప్రేక్షకులకు ‘త్రికాల’ సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది.
రేటింగ్: 2.75

