ఒక సైకో  వరస హత్యలు చేస్తూంటాడు. అతన్ని  పోలీస్ లు కష్టపడి పట్టుకుంటారు. ఇదీ స్టోరీ లైన్ అంటే కొత్తేముందీ రోజూ పేపర్లు,టీవీల్లో చూసేదే కదా అనిపిస్తుంది. కానీ ఒక్కో క్లూ పేర్చుకుంటూ  ఎలా పట్టుకున్నారు అనే విషయం ఎప్పుడూ ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. దానికో టైమ్ లైన్ ఉంటుంది... ఆ సైకో  మరో హత్య  చేసే లోపలే పట్టుకోలగలిగాలి.  ఇలా ఓ   టైమ్ అండ్ స్పేస్ లో  జరిగే కథలు మనకు తక్కువే. ఈ కథ కూడా మనది కాదు. తమిళంలో హిట్టైన రాక్షసన్ చిత్రాన్ని  రీమేక్  చేసారు. ఆ రీమేక్ రాణించిందా..మన వాళ్లకు నచ్చుతుందా,  కథేంటి,  హిట్ కోసం డెస్పరేట్ గా ఎదురుచూస్తున్న బెల్లంకొండ శ్రీనుకు హిట్ ఇచ్చిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

కథ:
అసెస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తున్న  అరుణ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌) కి  ఓ సైకో కిల్లర్ సినిమా చేయాలని కోరిక. అందుకు తగినట్లుగా రీసెర్చ్ చేసి ఓ కథ తయారు చేసుకుని తిరుగుతూంటాడు. అయితే అతనికి ఎవరూ అవకాసం ఇవ్వరు. ఇల్లు గడవటం కోసం చనిపోయిన  తన తండ్రి  చేసిన పోలీస్ డిపార్టమెంట్ లో ఇన్సపెక్టర్  గా చేరుతాడు. జాబ్ లో చేరిన వెంటనే ఓ సీరియల్ కిల్లర్ కేసు ఇన్విస్టిగేషన్  చేయాల్సి వస్తుంది. వరస పెట్టి స్కూల్స్ లో చదివే ఆడపిల్లల హత్యలు జరుగుతూంటాయి. ఒక్క క్లూ కూడా దొరకకుండా ఆ సైకో  చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.  అయినా అరుణ్  వదలకుండా తను రీసెర్చ్ చేసి తెలుసుకున్న నాలెడ్జ్ తో  ఈ సైకో కిల్లర్ కోసం వేట సాగిస్తూంటాడు.  

మరో ప్రక్క ఈ కేసుని కొత్తగా చేరిన అరుణ్ డీల్ చేయటం పై అథికారులకు  ఇష్టం ఉండదు.  దాంతో వాళ్లు అతనిపై ఒత్తిడి తెస్తూంటారు. ఇదిలా ఉండగా అరుణ్ మేనకోడలుని  సైతం సైకో చంపేస్తాడు. దాంతో  అరుణ్ లో పట్టుదల రెట్టింపు అవుతుంది. ప్రాణాలకు తెగించైనా ఆ సైకోని పట్టుకోవాలని చేసిన ప్రయత్నం చివరకు ఏ మలుపు తీసుకుంది. ఇంతకీ ఆ సైకో ఎవరు..టీనేజ్ ఆడపిల్లలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు,ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ఏమిటి  వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
  

స్క్రీన్ ప్లేనే సినిమా:

మొదటే చెప్పుకున్నట్లు  ఇలాంటి సైకో  థ్రిల్లర్స్ ఎక్కువగా కొరియా భాషలో వస్తూంటాయి. మనకు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఇలాంటి సినిమాలకు బిగిసడలని స్క్రీన్ ప్లే అవసరం. అదే ఈ సినిమాకు కుదిరింది. తమిళంలో  సూపర్ హిట్ అవటానికి రీజన్ అయ్యింది. తెలుగులోనూ యధాతథంగా అదే స్క్రీన్ ప్లేని ఫాలో అవటం కలిసొచ్చింది. ఇక్కడ నేటివిటి అంటూ పెద్ద మార్పులు చేయలేదు. పాటలు వచ్చినప్పుడు తప్ప మిగతా సమయాల్లో సినిమా రేసిగా పరుగెడుతుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందనే ఆసక్తి  క్రియేట్ చేయగలిగింది.  ఫస్టాఫ్  హీరో, అతని యాంబిషన్,  హీరోయిన్, సైకో హత్యలు  సెటప్ చేయటానికి సమయం సరిపోతుంది. దాంతో పెద్దగా ఏమీ జరిగినట్లు అనిపించదు. కానీ సెకండాఫ్ కు వచ్చేసరికి మాత్రం కథనం పరుగెడుతుంది. సైకోకు, హీరో కు మధ్య   పిల్లి, ఎలుక ఆటలా సాగుతుంది. హీరో ..సైకోని పట్టుకోవటానికి వేసే ప్లాన్స్, సైకో  గురించి క్లూలు వెతకి పట్టుకోవటం బాగుంటాయి. 

టెక్నికల్  గా ..

ఇలాంటి సినిమాకు కెమెరా వర్క్, రీరికార్డింగ్  ప్రాణం. ఈ రెండు విభాగాలు వందకు వంద శాతం ఫెరఫెక్ట్  అవుట్ ఫుట్ ఇచ్చాయి. స్క్రీన్ కూడా గ్రిప్పింగ్ గా ఉండటం, డైలాగులు ఆచి తూచినట్లుగా ఉండటంతో విసుగెత్తించదు. ఎడిటింగ్ సైతం ఈ జానర్ కు తగినట్లు ఉంది. క్లైమాక్స్ లో ఫైట్ సీన్ ...ఇంకాస్త  బాగా చేసి ఉంటే బాగుండేది. అక్కడే రొటీన్ గా లాగినట్లు అనిపించింది.  దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవటానికి ఏమీ లేదు. తమిళ వెర్షన్ ఎదురుగా పెట్టుకుని షాట్ బై షాట్ తీసుకుంటూ వెళ్లిపోయినట్లు అనిపించింది. అలా చేయటమే బెస్ట్ కూడా.  తమిళ ఒరిజనల్ చూడని వాళ్లకు ఈ సినిమా సూపర్ అనిపిస్తుదనటంలో సందేహం లేదు. 
  
నటీనటుల విషయానికి వస్తే.. సినిమా ఎంత ఇంటెన్స్ తో నడిచినా, బెల్లంకొండ శ్రీనివాస్ ఫేస్ లో మాత్రం ఆ  టెన్షన్ కు సంభందించిన ఎక్సప్రెషన్స్ కనపడవు. సినిమా మొత్తం దాదాపు రెండు మూడు ఎక్సప్రెషన్స్ తో లాగేసాడు.  హీరోయిన్ గా అనుపమ కు స్క్రీన ప్రెజన్స్ ఉన్నదే తక్కువ. ఉన్నంతలో బాగానే చేసింది. మిగతా పాత్రల్లో సీనియర్ ఆర్టిస్ట్ లు రెగ్యులగా చేసుకుంటూ పోయారు.  లెక్కలు టీచర్ పాత్ర వేసినతను మాత్రం  చాలా బాగా చేసారు. రాజీవ్ కనకాల చాలా కాలం తర్వాత గుర్తుండే పాత్ర చేసారు. 

ఫైనల్ థాట్:

బెల్లంకొండ శ్రీను కు ఇలాంటి కథ హీరోగా నడిచే  రీమేక్ లే బెస్ట్ అనిపిస్తుంది. 

Rating:3/5