తెలుగులో టాప్ యాంకర్ గా కొనసాగుతున్న అనసూయ నటిగా కూడా రాణిస్తోంది. క్షణం, రంగస్థలం లాంటి చిత్రాలు అనసూయ క్రేజ్ పెంచాయి. దీనితో అనసూయని పలు చిత్రాల్లో కీలక పాత్రల కోసం తీసుకుంటున్నారు. అనసూయ ప్రధాన పాత్రలో నటించిన కథనం చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా విడుదలైన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. అంచనాలు అందుకుందా లేదా అనేది మన సమీక్షలో చూద్దాం!

కథ: 

అను( అనసూయ) దర్శకురాలిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఓ నిర్మాతకు అనసూయ కథ వినిపిస్తుంది. ఆశ్చర్యకరంగా ఆ కథలోని పాత్రల్లాగే కొందరు వ్యక్తులు మరణిస్తూ ఉంటారు. ఈ హత్యల గురించి అను పోలీస్ ఆఫీసర్ రణధీర్ కు తెలియజేస్తుంది. రణధీర్ విచారణలో కొన్ని షాకిచ్చే  నిజాలు బయటపడతాయి. అసలు ఇంతకీ ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు.. ఆ నిజాలు ఏంటి అనేది సినిమా చూసే తెలుసుకోవాలి. 

అనసూయ నటన ఎలా ఉంది: 

కథనం చిత్రం మొత్తానికి అనసూయ నటనే ఆకర్షణగా నిలిచింది. అనసూయ తన నటనతో కథని నడిపించింది. అనసూయ పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయి. రెండింటిలో అనసూయ మంచి పెర్ఫామెన్స్ ఇచ్చింది. మోడ్రన్ లేడీగా మెప్పించిన అనసూయ, సాంప్రదాయ లుక్ లో కూడా ఆకట్టుకుంది. 

ప్లస్ పాయింట్స్:

ముందుగా చెప్పుకున్న విధంగా ఈ చిత్రానికి అనసూయ ప్రధాన బలం. ఈ చిత్రంలో ఇంటర్వెల్ సన్నివేశాన్ని చాలా బాగా డిజైన్ చేశారు. సస్పెన్స్ పెంచుతూ సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచారు. వెన్నెల కిషోర్ పాత్ర నవ్వులు పూయించే విధంగా ఉంటుంది. ఇక ఈ చిత్రంలో నటుడు ధనరాజ్ కీలక పాత్రలో నటించారు. అతడి పాత్ర కూడా బావుంటుంది. 

ధనరాజ్ చాలా రోజుల తర్వాత వచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. హాస్యభరితమైన హావభావాలతో ఆతడి పాత్ర సరదాగా సాగుతోంది. పోలీస్ ఆఫీసర్ గా నటించిన రణధీర్ పాత్ర కూడా మెప్పిస్తుంది. 

మైనస్ పాయింట్స్: 

దర్శకుడు ఈ చిత్రంలో సస్పెస్ కొనసాగించడంలో విజయవంతం అయ్యాడు. కానీ సన్నివేశాలు అంత బలంగా అనిపించవు. కథనం ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఇలాంటి చిత్రంలో మధ్యలో కొన్ని రెగ్యులర్ కమర్షియల్ అంశాలు ఇబ్బందిగా అనిపిస్తాయి. అనసూయ గ్లామర్ ని దృష్టిలో ఉంచుకుని పాటలు డిజైన్ చేశారు. దీనితో ఆ పాటలు కథ ఫ్లో కు అడ్డు తగులుతాయి. 

ఈ చిత్రానికి అత్యంత కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ని దర్శకుడు ఆసక్తికరంగా తీర్చిద్దలేదు. విలన్ పాత్రలు కూడా ఆసక్తికరంగా లేవు. నటుడి శ్రీనివాస్ అవసరాలని దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. సినిమాలో సస్పెన్స్ రివీల్ ఐన తర్వాత ఇది రెగ్యులర్ రివేంజ్ డ్రామా అనే ఫీలింగ్ కలుగుతుంది. 

దర్శకుడి పనితనం: 

దర్శకుడు రాజేష్ నాదెండ్ల మంచి సస్పెన్స్ పాయింట్ తో చక్కటి స్క్రీన్ ప్లేని అందించాడు. కథ రెగ్యులర్ రివేంజ్ డ్రామా అయినప్పటికీ ద్వితీయార్థంలో వచ్చే డైలాగులు ఆకట్టుకుంటాయి. కెమెరామెన్ సతీష్ ముత్యాల పనితనం బాగుంది. సంగీత దర్శకుడు సునీల్ మంచి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. 

ఫైనల్ గా : కథనం చిత్రం అనేది అనసూయ తన నటనతో నడిపించిన రివేంజ్ స్టోరీ. కొన్ని సన్నివేశాలు మాత్రమే ప్రేక్షకులని మెప్పిస్తాయి. కీలకమైన ట్విస్ట్ తెలిశాక మామూలు రివేంజ్ కథే అని అనిపిస్తుంది. 

Rating: 2.5