--సూర్య ప్రకాష్ జోశ్యుల

తీవ్రవాదం, టెర్రరిస్ట్ లు చుట్టూ అల్లిన కథలతో వచ్చిన సినిమాలు మన దగ్గర పెద్దగా వర్కవుట్ కావటం లేదు. టెర్రరిజం కు అంతం, అంతు లేదని భావించే ప్రేక్షకులు,సినిమాటెక్ గా దాన్ని అంతమొందించటం అనే అంశాన్ని నమ్మలేకపోతున్నారు. ఏదైనా వాస్తవిక సంఘటనను బేస్ చేసుకుని తెరకెక్కిస్తే సమస్య లేదు కానీ ,ఊహాతీత దేశభక్తి కథలు అంటే బక్కెట్ తన్నేస్తున్నాయి. బిలీవ్ బులిటీ లేని ఈ కథలు భాక్సాఫీస్ వద్ద బ్రతకిబట్టకట్టడం అనేది కష్టమైపోయింది. ఇవన్ని ప్రతీ సినిమావాడికీ తెలుసు. అయినా సరే ధైర్యంగా ఓ టెర్రిరిస్ట్ ఆపరేషన్ ని ప్రధానాంశంగా తీసుకుని తెరకెక్కిన చిత్రం ఆపరేషన్ గోల్డ్ ఫిష్. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో ఆది, దర్శకుడు అడవి సాయి కిరణ్ కు ఈ ఫిష్ నిజంగానే బంగారమైందా..లేక బలైపోయిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి..?

ఎన్.ఎస్.జి కమాండో కెప్టెన్‌  అర్జున్‌ పండిట్‌ (ఆది). అతను టెర్రరిస్ట్ గ్రూప్ నాయకుడు ఘాజీ బాబా (అబ్బూరి రవి)ని పక్కా ప్లానింగ్ తో  అరెస్ట్ చేస్తాడు. ఘాజీ బాబాకు కోర్ట్ ఉరిశిక్ష వేస్తుంది. అయితే తమ లీడర్ కు ఉరి శిక్ష పడుతూంటే ఆ గ్రూప్ లో మిగతా వాళ్లు ఊరుకోరు కదా. దాంతో ఘాజీబాబాను కాపాడేందుకు అతడి ముఖ్య అనుచరుడు ఫరూఖ్‌ (మనోజ్‌ నందం) రంగంలోకి దిగుతాడు. ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ అంటూ ఓ ప్లాన్  రచిస్తాడు.  అందులో భాగంగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఏకే శర్మ (రావు రమేశ్‌) కూతురు నిత్యను కిడ్నాప్‌ చేసి భారత ప్రభుత్వాన్ని బెదిరించి, ఘాజీ బాబాని విడిపించాలనుకుంటాడు.  ఆ విషయం తెలుసుకున్న అర్జున్ పండిత్ ఏం చేసాడు...ఎలా కౌంటర్ ఎటాక్ ఇచ్చాడు అనేది మిగతా కథ.

హిందీలో వచ్చిందే...

ఈ సినిమా చూస్తూంటే మనకు షారూఖ్ ఖాన్ చేసిన హిట్ చిత్రం మైహూనా స్టోరీ లైన్ తీసుకుని చేసారని అర్దమైపోతుంది. అయితే మైహూనా లో ఉంటే ఎంటర్టైన్మెంట్ వేరు. ఆ భారీతనం, స్టార్ అన్ని కలిసి వచ్చాయి. అదే ఇక్కడ మిస్సైంది. అయినా గతంలో మైహూనా ని చక్కగా మిరపకాయ అంటూ తెరకెక్కించి హిట్ కొట్టారు. ఆ సినిమాలో ఏవి వర్కవుట్ అయ్యాయో..ఇక్కడ అవే మైనస్ లుగా మారటం దురదృష్టం.
 
టైటిల్ కొత్త...సీన్స్ పాత

సినిమాల్లో దేశభక్తి కూడా అవుట్ డేటెడ్ అంశంగా మారిపోయిన ఈ దశలో ఇలాంటి స్టోరీ లైన్ తో రావటం సాహసమే. అలాగే ఇలాంటి కథలు హీరో ఆదికు, దర్శకుడు అడవి సాయికిరణ్ కు కొత్త కావచ్చు కానీ  తెలుగు సినిమాకు కొత్తేమీ కాదు. టెర్రరిస్ట్ ఎటాక్ లు, అరెస్ట్ లు, విడిపించటానికి ప్రయత్నాలు ఇదివరకే చాలా సినిమాల్లో వచ్చేయటంతో పెద్దగా ఏమీ అనిపించదు. టైటిల్ ఒకటే కొత్తగా ఉంది కానీ టోటల్ గా విషయం మాత్రం పాతదే.   ఇంత సీరియస్ కథలో వచ్చే సబ్ ప్లాట్ అయిన కాలేజి, అక్కడ లవ్ స్టోరీలు మొత్తం సినిమాని సోది క్రింద మార్చేసాయి. దానికి తోడు కమర్షియల్ ఎలిమెంట్స్...ఆర్మీ ఆఫీసర్, టెర్రరిస్ట్ నాయకుడు మధ్య వాద,ప్రతివాదాలు..ఇవన్ని సినిమాని అడుగడుక్కీ క్రిందకి తోసుకుంటూ పోయాయి.

డైరక్షన్, మిగతా డిపార్టమెంట్ లు

వినాయకుడు సినిమాతో పరిచయం అయిన అడవి సాయి కిరణ్ ఇలాంటి సినిమాతో మళ్లీ మనకు కనిపిస్తాడని ఊహించం. చాలా అమెచ్యూరిష్ గా తీసినట్లు ఉంటుంది. చాలా పూర్ స్క్రిప్టు. తన శైలి ఫన్ ని , సీన్స్ ని కాలేజీ సీన్స్ లో పెడదామనుకున్నాడు కానీ అవీ బ్యాక్ ఫైర్ అయ్యాయి. పాటలు సినిమాలో కలిసిపోయాయి..అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడా కొన్ని పార్ట్ లలో ఎఫెక్టివ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ యావరేజ్. ఎడిటింగ్ ..ఇంకా బాగా చేయాల్సింది. డైలాగులు మొక్కుబడిగా రాసినట్లు ఉన్నాయి. బడ్జెట్ కూడా డైరక్టర్ కు సహకరించినట్లు లేదు.

నటీనటుల్లో ఆది..సీరియస్ గా చేసుకుంటూ వెళ్లిపోయాడు. అతని బాడీ లాంగ్వేజ్, ఫిటెనెస్ అన్నీ ఫెరఫెక్ట్. అయితే ఈ సినిమాకూడా అతనికి కలిసి వచ్చేటట్లు లేదు.  ఘాజీబాబాగా రచయిత అబ్బూరి రవి చేసారు. ఆ పాత్ర గెటప్ వరకూ చూసుకున్నారు. కానీ సినిమాలో ఆ పాత్ర తేలిపోయింది. టెర్రరిస్ట్ లు, మిలిట్రీ మధ్య జరిగే విషయం మొత్తం ఏదో కార్టూన్స్ లో చూస్తున్నట్లు ఉంటుంది కానీ ఎదురుగా జరుగుతున్నట్లు అనిపించదు. మిగతా పాత్రల్లో కృష్ణుడు బాగా చేసాడు. రావు రమేష్ కు పనికొచ్చే పాత్ర కాదు. హీరోియన్ నిత్యా నరేష్ ది అదే పరిస్దితి. మనోజ్ నందం..టెర్రరిస్ట్ గా అసలు సూట్ కాలేదు.

ఫైనల్ థాట్

ఓ ప్రక్కన హిందీలో ...పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఉగ్రవాదుల బేస్ క్యాంప్‌పై భారతసైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ ఆధారంగా ‘యురి’వంటి సినిమాలు చేస్తూ సక్సెస్ అవుతూంటే మనం మాత్రం ఇలాంటి ఆపరేషన్ అంధకారంలను నిర్వహిస్తున్నాం.  

Rating:2/5
 
ఎవరెవరు..

నటీనటులు: ఆది, సాషా చెత్రి, అనీష్‌ కురువిల్లా, మనోజ్‌ నందన్‌, అబ్బూరి రవి, కార్తీక్‌ రాజు, పార్వతీశం, నిత్య నరేష్‌, కృష్ణుడు, రావు రమేశ్‌ తదితరులు
సంగీతం: శ్రీచరణ్‌ పాకాల
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
సినిమాటోగ్రాఫర్‌: జైపాల్ రెడ్డి
కూర్పు: గ్యారీ బీహెచ్‌
నిర్మాతలు: ప్రతిభ అడవి, కేశవ్‌ ఉమా స్వరూప్‌, పద్మనాభరెడ్డి
దర్శకుడు: అడవి సాయికిరణ్‌