ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీల బంధాన్ని ప్రశ్నిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. సోమవారం గోరఖ్‌పూర్‌లో నటుడు రవికిషన్‌కు మద్ధుతుగా ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీలపై విమర్శలు చేశారు.

కాంగ్రెస్ కేవలం బీజేపీ ఆధిక్యాన్ని తగ్గించేందుకే ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తుందన్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ చివరకు ఈ స్ధాయికి దిగజారిందని.. ప్రియాంక గాంధీ మాటలను చూస్తుంటే ఇది నిజమని అనిపిస్తుందని యోగి ఎద్దేవా చేశారు.

ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారన్నారు. రాముడు, కృష్ణుడు ఉన్నట్లు ఎక్కడా రుజువు లేదని గతంలో కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని... మరి అలా అయితే ఆలయాల్ని సందర్శించినప్పుడు రాహుల్ ఎవరిని పూజిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

ఏనుగు బరువుతో సైకిల్ పంక్చర్ అవ్వడం ఖాయమంటూ ఎస్పీ, బీఎస్పీలపై సెటైర్లు వేశారు. ఎలాంటి వివక్ష లేకుండా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించామని ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. కుంభమేళాలో పారిశుద్ధ్య కార్మికుల పాదాలను ప్రధాని కడగటాన్ని కృష్ణుడు.. సుధామా కాళ్లని కడగటంతో యోగి పోల్చారు.