మోదీ ప్రమాణస్వీకారం..ప్రత్యేక అతిథులుగా వారికి ఆహ్వానం
భారత దేశ ప్రధానిగా నరేంద్రమోదీ మరోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. వరసగా రెండో సారి ఆయన ప్రధాని బాధ్యతలు చేపడుతున్నారు.

భారత దేశ ప్రధానిగా నరేంద్రమోదీ మరోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. వరసగా రెండో సారి ఆయన ప్రధాని బాధ్యతలు చేపడుతున్నారు. ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం గురువారం రాత్రి రాష్ట్రపతి భవన్ లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, బీజేపీ అగ్రనేతలు, విదేశాల నుంచి ప్రముఖులతో పాటు... మరికొందరు ముఖ్య అతిథులు హాజరుకానున్నారు.
ఆ ముఖ్య అతిథులు మరెవరో కాదు.. బీజేపీ కార్యకర్తల కుటుంబసభ్యులు. ఇటీవల పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో ఘర్షణ జరిగి ప్రాణాలు కోల్పోయిన బీజేపీ కార్యకర్తల కుటుంబసభ్యులను ముఖ్య అతిథులుగా ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు.
మంగళవారం రాత్రి మెదీ, అమిత్ షా మధ్య జరిగిన సుదీర్ఘ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ‘ప్రత్యేక ఆహ్వానితుల’ జాబితా ఖరారవగా.. దాన్ని రాష్ట్రపతి భవన్‌కు అందజేయనున్నట్లు పేర్కొన్నాయి.
ఎన్నికల ఘర్షణల్లో మృతిచెందిన దాదాపు 50 మందికి పైగా బీజేపీ కార్యకర్తల కుటుంబ సభ్యులు రేపు ప్రమాణస్వీకారానికి రానున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో ప్రాణాలు కోల్పోయిన తమ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు బీజేపీ అధిష్టానం అండగా ఉంటుందని చెప్పేందుకే వారిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.