ఉత్తరప్రదేశ్ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. రోజురోజుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారిపై కేంద్ర ఎన్నికల సంఘం మెుట్టికాయలు వేస్తున్నప్పటికీ నేతల తీరులో ఏ మాత్రం మార్పు రావడం లేదు. 

ఇటీవలే బీఎస్పీ అధినేత్రి మాయావతి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆజంఖాన్ వంటి వారిపై ఈసీ చర్యలు తీసుకున్నప్పటికీ తాజాగా బీజేపీ ఎంపీ అభ్యర్థి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బదౌన్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంఘమిత్ర మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. 

యూపీ మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య కూతురైన సంఘమిత్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతీచోటా దొంగ ఓట్లు వేయడం జరుగుతూనే ఉంటుంది కదా అంటూ ప్రజలను ప్రశ్నించారు. మీకు కూడా చాన్స్‌ వస్తే అలాగే చేయండి అంటూ ప్రజలను దొంగఓట్లు వెయ్యాలంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు. 

బదౌన్‌ నియోజకవర్గం ప్రజలంతా ఓటేయ్యాలని పిలుపునిచ్చారు. ఒకవేళ ఓటర్లు రాకపోతే మీరే దొంగ ఓట్లు వేసేయండి. కాకపోతే కాస్త రహస్యంగా ఆ పని చేయండి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతరం నాలుక్కరచుకున్న ఆమె పోలింగ్‌ రోజు ప్రతీ ఒక్కరు ఓటు వేయాల్సిందేనని చెప్పుకొచ్చారు. 

సంఘమిత్ర మౌర్య ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడం కొత్తేమీ కాదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఎన్నికల సందర్భంగా ఎవరైనా గూండాయిజం చెయ్యాలని ప్రయత్నిస్తే అస్సలు బాగోదు ఎందుకంటే తానే పెద్ద గూండాను అంటూ చెప్పుకొచ్చారు. 

మీ ఆత్మగౌరవం నిలవాలంటే బదౌన్ ప్రజల జోలికి రావొద్దు, నేను ఇక్కడే ఉన్నానంటూ ప్రత్యర్థి పార్టీలకు హెచ్చరించారు. ఇకపోతే సంఘమిత్ర మౌర్య ఎస్పీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్ తో తలపడుతున్నారు.