సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. గత ఎన్నికల్లో బీజేపీకి అధికారాన్ని అందించిన ఉత్తరప్రదేశ్‌లో ఈసారి బీజేపీ, మిత్రపక్షాలు కలిసి 74 సీట్లు సాధించబోతున్నాయని రాజ్‌నాథ్ జోస్యం చెప్పారు.

గతం కన్నా ఎక్కువ సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని, మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించే అవకాశం కూడా లేకపోలేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొదట్లో ఎస్పీ-బీఎస్పీ ఓ గట్టి కూటమి అని తాము కూడా భావించామని.. కానీ క్రమంగా అది బలహీనపడిపోయిందన్నారు.

మాయావతి సారథ్యంలోని బీఎస్పీయే ఇప్పుడు మునుగుతున్న నావలా మారిందని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. బీఎస్పీ, ఎస్పీ ప్రభుత్వాలను యూపీ ప్రజలు గతంలో చూశారని వాటి పట్ల వ్యతిరేకతతోనే బీజేపీని అక్కడి ప్రజలు గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఆశీర్వదించారని గుర్తు చేశారు.

2014 ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీపై దేశ ప్రజలు ఆశలు పెట్టుకోగా ఇప్పుడది నమ్మకంగా మారిందని తెలిపారు. ఆర్ధిక రంగంలో మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అద్భుతమైన ప్రగతిని సాధించిందని, గత ఐదేళ్లలో ధరల పెరుగుదల సమస్య తలెత్తలేదని రాజ్‌నాధ్ సింగ్ వెల్లడించారు.

ఆఖరిదశ పోలింగ్ తేదీ దగ్గరపడుతోందని.. ఇకనైనా దాగుడుమూతలు ఆపి మీ ప్రధాని అభ్యర్ధి ఎవరో చెప్పాలని విపక్షాలను ప్రశ్నించారు. 2014 ఎన్నికలు మోడీకి, మన్మోహన్ సింగ్‌కి మధ్య జరిగాయని.. మరి 2019లో మోడీ ఉన్నారు.. మరి మీవైపు ఎవరు ఉన్నారు అని ప్రశ్నించారు.