ఎన్నికల సందర్భంగా నేతల రోడ్‌షోలు, ప్రచారం కారణంగా దేశవ్యాప్తంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో అత్యవసర పరిస్ధితుల్లో ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తాజాగా హర్యానాలోని సిర్సాలో బీజేపీ నిర్వహించిన రోడ్‌షో కారణంగా ఒక అంబులెన్స్‌ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. వివరాల్లోకి వెళితే.. బీజేపీ అభ్యర్థి సునీతా దుగ్గల్ రోడ్‌షో నిర్వహించారు.

ఈ సమయంలో ఫతేబాద్ పరిధిలోని రోయి గ్రామానికి చెందిన గర్భిణి కోమల్‌ను ఫతేబాద్ సివిల్ ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. సునీత రోడ్‌షో కారణంగా బీజేపీ కార్యకర్తలు వాహనాలను ఆపివేస్తున్నారు.

ఈ ట్రాఫిక్ జామ్‌లో అంబులెన్స్‌ 15 నిమిషాల పాటు చిక్కుకుపోయింది. ఇంతలో అంబులెన్స్‌ను మరో వాహనం వెనుక నుంచి ఢీకొంది. తరువాత ఎలాగోలా అంబులెన్స్ ముందుకు కదిలింది.

దీంతో ఆ గర్భిణి చేతికి గాయమైంది. దానితో పాటు నొప్పులతో విలవిలాడిపోయింది. విషయం తెలుసుకున్న సునీతా దుగ్గల్ తన వల్ల ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది కలిగినా క్షమించమని కోరుతున్నానన్నారు.