అతి తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో ప్రచారంలో పాల్గొనేందుకు పార్టీలు హెలికాఫ్టర్ల మీద ఆధారపడుతున్నాయి. తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో నేతల విహంగ ప్రయాణం జోరందుకుంది.
అతి తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో ప్రచారంలో పాల్గొనేందుకు పార్టీలు హెలికాఫ్టర్ల మీద ఆధారపడుతున్నాయి. తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో నేతల విహంగ ప్రయాణం జోరందుకుంది.
ఇక ఎక్కువగా హెలికాఫ్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు వినియోగిస్తున్న పార్టీగా బీజేపీ తొలి స్థానంలో ఉంది. ఆ పార్టీ మొత్తం 20 హెలికాఫ్టర్లను, 12 బిజినెస్ జెట్లను వినియోగిస్తోంది. ఇందులో సెస్నా సైటేషన్ ఎక్స్‌ఎల్ఎస్, ఫాల్కన్ 4000, బెల్ 412, అగస్టా 109, అగస్టా 139 హెలికాఫ్టర్లు ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ 10 హెలికాఫ్టర్లను, 4 బిజినెస్ జెట్లను వాడుతుండగా అందులో సెస్నా సైటేషన్ జెట్ 2, సెస్నా సైటేషన్ ఎక్సెల్, ఫాల్కన్ 4000 విమానాలు, బెల్ 407, యూరోకాఫ్టర్ డీ3, బెల్ 412, అగస్టా హెలికాఫ్టర్లు ఉన్నాయి.
2014 ఎన్నికల సమయంలో ఎక్కువ విమానాలను వినియోగించిన కాంగ్రెస్... ఈ సారి తగ్గించింది. సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీలు రెండు ఇంజిన్లు కలిగిన హెలికాఫ్టర్లను అద్దెకు తీసుకున్నాయి.
పార్టీల హెలికాఫ్టర్ల వినియోగంపై ప్రైవేట్ ఏవియేషన్ సంస్థ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. బీజేపీలో ప్రధానితో సహా ఎక్కువ మంది స్టార్ క్యాంపెయినర్లు ఉండటంతో ఆ పార్టీ ఎక్కువగా చాపర్లను వినియోగిస్తోందన్నారు.
అయితే ఈ సారి చాలా పార్టీలు తక్కువ మొత్తంలోనే విమానాలను వాడుతున్నాయని, తాము కాంట్రాక్టు ప్రాతిపదికన, తాత్కాలిక అవసరాలను బట్టి విమానాలను అద్దెకు ఇస్తామని వివరించారు.
సగటున ఒక్కో పార్టీ ఒక విమానాన్ని 45 రోజులకు అద్దెకు తీసుకుంటాయని వీటి అద్దె గంటలకు రూ. లక్ష నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుందని ఆయన తెలిపారు. మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి హెలికాఫ్టర్లు, విమానాలు దొరక్కుండా మోడీ సర్కారు కుట్ర చేస్తోందని కర్ణాటక సీఎం కుమారస్వామి వ్యాఖ్యానించడం కలకలం రేపింది.
