అమేథీలో స్మృతీ ఇరానీ విజయం కోసం ప్రచారం చేసిన బీజేపీ కార్యకర్తపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. వివరాల్లోకి వెళితే... సురేంద్ర సింగ్ అనే వ్యక్తి బారౌలియా గ్రామానికి బీజేపీ అధ్యక్షుడు..

ఈ గ్రామాన్ని 2015లో సన్సద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకం కింద దివంగత మాజీ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ దత్తత తీసుకున్నారు. ఈ క్రమంలో తాజా సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తరపున సురేంద్ర సింగ్ అమేథీలో ప్రచారం నిర్వహించారు.

బహిరంగసభలలో తన వాడి వేడి మాటలతో ప్రత్యర్ధులను విమర్శిస్తూ బీజేపీ నేతల మన్ననలు పొందారు సురేంద్ర. కౌంటింగ్ రోజున రాహుల్ గాంధీపై స్మృతీ ఇరానీ గెలుపొందడంతో సురేంద్ర  హర్షం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున సురేంద్ర ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఆయనపై కాల్పులు జరిపి పరారయ్యారు. తుపాకీ శబ్ధంతో ఉలిక్కిపడిన కుటుంబసభ్యులు.. రక్తపు మడుగులో పడివున్న సురేంద్రను హుటాహుటిన లక్నోలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు.